ఖమ్మం, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు గత కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలలన్నీ కొత్తందాన్ని సంతరించుకున్నాయి. నూతన హంగులతో శోభాయమానంగా ముస్తాబయ్యాయి. ‘మన ఊరు-మన బడి’ కింద గత కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ ఆ నిధులను ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ విడుదల చేయకపోవడంతో పనులు చేపట్టిన గుత్తేదార్లు ఇబ్బందులు పడుతున్నారు.
ఏడాదికాలంగా బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ.. ‘బడి’ బకాయిలు ఇప్పించండి సారూ..! అంటూ అధికారులను వేడుకుంటున్నారు. పనులు చేసే సమయంలో వెంటపడి చేయించిన అధికారులు.. పెండింగ్ బిల్లులు చెల్లించి ఆదుకోమంటే చేతులెత్తేస్తున్నారని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. అప్పులు తెచ్చి పనులు చేపట్టామని.. వాటికి వడ్డీలు చెల్లించలేని పరిస్థితి నెలకొందని ఆవేదన చెందుతున్నారు. బిల్లులు చెల్లించకుంటే ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన చెందుతున్నారు. చేసిన పనులకు బిల్లులు ఇప్పించండి మహాప్రభో..! అంటూ నిత్యం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న కాంట్రాక్టర్లను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోని తీరుపై ‘నమస్తే తెలంగాణ’ కథనం.
ప్రభుత్వ బడుల దిశ, దశ మార్చాలనే సంకల్పంతో గత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన మన ఊరు-మన బడి/మన ఊరు-మన బస్తీ పథకాన్ని నిలుపుదల చేశారు. దాని స్థానంలో అమ్మ ఆదర్శ పాఠశాలలు అంటూ మరో పథకాన్ని నిర్వహిస్తున్నారు. మన ఊరు-మన బడి పథకంతో సర్కార్ బడులు ఆధునిక హంగులతో రూపుదిద్దుకున్నాయి. ఒక్క సమస్య కూడా ఉత్పన్నం కాకుండా అన్ని సదుపాయాలు సమకూర్చారు.
పూర్తిస్థాయిలో ఆధునికీకరణ, మౌలిక వసతులు, నీటి వసతితో కూడిన అత్యాధునిక టాయిలెట్లు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు కార్పొరేట్ స్కూల్స్‌కే పరిమితమైన అత్యాధునిక ప్రమాణాలతో కూడిన పరికరాలను ప్రభుత్వ పాఠశాలలో అందుబాటులోకి తెచ్చారు. నీటి సరఫరా, మరుగుదొడ్లు, విద్యుదీకరణ, తాగునీరు, ఫర్నిచర్, పెయింటింగ్, మరమ్మతులు, ఆకుపచ్చ రాత బోర్డులు, ప్రహరీ, వంట గది, నూతన తరగతి గదులు, భోజనశాల, డిజిటల్ సౌకర్యాలను సమకూర్చి పనులు పూర్తి చేశారు. జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన 426 స్కూల్స్‌లో పనులు నిర్వహించింది.
మన ఊరు-మన బడిలో భాగంగా పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లు నిత్యం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారులను కలుస్తూ తమ గోడు వెళ్లబోసుకుంటున్నా ఫలితం ఉండడం లేదు. ఇప్పటికీ పదుల సంఖ్యలో వినతిపత్రాలు ఇచ్చి తమ బిల్లులు చెల్లించాలని కోరినా కరుణించిన వారు లేరు. పనులు పూర్తి చేసేవరకు ఉరుకులు పెట్టించిన అధికారులు ఇప్పుడు తమ చేతుల్లో ఏమీ లేదు, ప్రభుత్వం నిధులు కేటాయించట్లేదని కాంట్రాక్టర్లకు చెబుతుండడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో గుత్తేదారులు ఉండిపోయారు. కనిపించిన ప్రతిప్రజాప్రతినిధులను తమ బిల్లులు ఇప్పించాలని విన్నవించుకుంటున్నా స్పందించే నాధుడే కరువయ్యాడని వాపోతున్నారు. రూ.లక్షలు చెల్లించి ప్రభుత్వ పనులు చేసి బిల్లుల కోసం అందరి చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంపై నిట్టూరుస్తున్నారు.
మన ఊరు-మన బడి పథకం ద్వారా 12 అంశాల్లో పనులు నిర్వహించగా.. నిర్మాణాలకు సంబంధించినవి కాకుండా మిగిలినవి రాష్ట్రస్థాయి నుంచే సరఫరా చేశారు. అదనపు తరగతి గదులు, కిచెన్ షెడ్లు, టాయిలెట్స్, డైనింగ్ హాల్ వంటివి జిల్లాస్థాయిలో కాంట్రాక్టర్లు పనులు పూర్తిచేశారు. పనులు పూర్తి చేసి సంవత్సరంన్నర పూర్తయిన బిల్లులు మాత్రం చేతిలో పడని దుస్థితి. జిల్లాలో 426 స్కూల్స్‌కి రూ.33.46 కోట్లు మంజూరు చేయగా.. వాటిల్లో రూ.23.76 కోట్లు గత కేసీఆర్ ప్రభుత్వం చెల్లింపులు చేసింది. వీటిల్లో రూ.3.5 కోట్లు పనుల అడ్వాన్స్‌ల కోసం అందజేసింది. పనులు పూర్తి చేసినా ఇంకా రూ.6.2 కోట్ల నిధులు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోతే జిల్లావ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టర్లు స్కూల్స్‌కి తాళం వేసే ఆలోచనలో ఉన్నారు. దీంతోపాటు వడ్డీలు చెల్లించలేక ఆత్మహత్యలే శరణ్యమని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు.
ఖమ్మం నగరంలోని ఇందిరానగర్ పాఠశాలలో రూ.30 లక్షలతో నాలుగు అదనపు తరగతి గదులను నిర్మించాను. గత ఏడాది ఆగస్టులోనే నిర్మాణం పూర్తి చేసి పాఠశాలను అందజేశాను. అప్పటినుంచి కలెక్టర్, డీఈవోల చుట్టూ తిరుగుతున్నా బిల్లులు మాత్రం చెల్లించడం లేదు. వీటితోపాటు డైనింగ్ హాల్ పూర్తి చేశా.. దానికి సీలింగ్ కూడా చేసిన పనికి సంబంధించిన మంజూరు కూడా ఇవ్వడం లేదు. అప్పటి కలెక్టర్ గౌతమ్ స్కూల్‌ని పరిశీలించి బాగుంది అని అభినందించారు. కానీ.. డబ్బులు మాత్రం రావడం లేదు. మా ఆర్థిక పరిస్థితి బాగోలేదు.. బిల్లులు రాకపోతే ఆత్మహత్యే శరణ్యం.. దీనికి ప్రభుత్వం, అధికారులే బాధ్యత వహించాలి.
– కొత్తా రవికుమార్, కాంట్రాక్టర్