వాతావరణ శాఖ చెప్పినట్లే ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఖమ్మం జిల్లాలోని చాలా మండలాల్లో ఇప్పటివరకు వర్షాల జాడ లేదు. జూన్ చివరివారం వచ్చినప్పటికీ జిల్లాలో ఎక్కడా పెద్ద వానలు కురవలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే అసలు ఈ ఏడాది వ్యవసాయమే ప్రశ్నార్థకంగా మారనున్నది. ముఖ్యంగా వరిసాగుపై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండనుంది. దీంతో రైతులు అటు వరి నారుమడులు సిద్ధం చేయాలా, లేక ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలా.. అన్న సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతు న్నారు. అయితే ఈ నెలాఖరు వరకు సమృద్ధిగా వర్షాలు కురిస్తేనే స్వల్పకాలిక వరి వంగడాలను విత్తుకోవాలని, లేదంటే ప్రత్యామ్నయ పంటలనే ఎంచుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు రైతులకు సూచిస్తున్నారు.
– రఘునాథపాలెం, జూన్ 20
వానకాలం ప్రారంభమైందంటే చాలు ఖమ్మం జిల్లాలో రైతులు వరి నారుమడులు సిద్ధం చేయడంలో బిజీబిజీగా ఉంటారు. కానీ, ఈ ఏడాది పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. చిరుజల్లులు మినహా ఎక్కడా భారీ వర్షాలు నమోదు కాలేదు. భూమినే నమ్ముకొని కుటుంబాలను నెట్టుకొస్తున్న అన్నదాతలు వరుణదేవుడి రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఆకాశం వైపు చూస్తూ.. వానకాలం పంటల సాగుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరిసాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గే అవకాశం కనిపిస్తోంది.
వానకాలంలో 3.20 లక్షల ఎకరాల్లో వరిసాగు విస్తీర్ణం జరుగుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అయితే ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వరిసాగు విస్తీర్ణం పూర్తిగా తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఎల్‌నినో కారణంగా ఈ వానకాలం సాధారణ వర్షపాతం కన్నా తక్కువ వర్షాలు నమోదవుతాయన్న వాతావరణ శాఖ అంచనాలు రైతుల్లో ఆందోళన పెంచుతోంది. ఈ నెలాఖరు వరకు సమృద్ధిగా వర్షాలు కురిస్తేనే స్వల్పకాలిక వరి వంగడాలను విత్తుకోవాలని, లేదంటే వద్దని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. దీంతో రైతులు వర్షాలు కురుస్తాయా లేక ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగు చేయాలా అన్న మీమాంసలో పడ్డారు.
భారీ వర్షాల కోసం ఎదురుచూపు..
గతేడాది వానకాలం సీజన్ కంటే ముందే మే చివరిలోనే జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి, దీంతో రైతులు మొదటివారంలోనే పెద్దఎత్తున విత్తనాలు వేశారు. కానీ, ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా ఉంది. జిల్లాలోని పలు మండలాల్లో ఓ మోస్తరు వానలు పడ్డాయి. పలు మండలాల్లో అసలు వర్షపాతమే నమోదు కాలేదు. రఘునాథపాలెం, ఖమ్మంరూరల్, కూసుమంచి, పాలేరు, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మినహాయిస్తే మిగతా అన్ని మండలాల్లో వర్షాభావ పరిస్థితులే నెలకొన్నాయి.
ఈ పరిస్థితుల్లో రైతులు సాగు విషయంలో ఆందోళనకు గురవుతున్నారు. జూన్ మొదటి రెండు వారాల్లోనే రైతులు పొడి దుక్కుల్లోనే విత్తనాలు వేస్తారు. వర్షాలు కురిస్తే అవి మొలకెత్తుతాయనే ఆశతో ముందుకెళ్తారు. జూన్ చివరి వరకు కూడా పత్తి విత్తనాలు వేయడాన్ని సాధారణ సాగుగానే పరిగణిస్తారు. జూలై మొదటి వారంలో కొంత ఆలస్యంగా, ఆ తరువాత వారాన్ని పూర్తిగా ఆలస్యంగా పరిగణిస్తారు. ఆలస్యంగా సాగు చేయడం ద్వారా చీడపీడలు, ఎదుగుదల లోపం, కాత, పూత సరైన సమయంలో రాకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమై పంట నష్టాన్ని చవిచూసే పరిస్థితి ఉంటుంది. ఈ కారణంగా జూన్‌లోనే విత్తనాలు వేసేందుకు రైతులు మొగ్గు చూపుతుంటారు.
ప్రత్యామ్నాయ పంటల వైపు..
వర్షాభావ పరిస్థితులు, యూరియా కొరత, ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో సమస్యల నేపథ్యంలో వరి, మొక్కజొన్న, పత్తి, మిర్చి పంటలు కాకుండా ఆరుతడి పంటలు వేసుకోవడం మేలు అని శాస్త్రవేత్తలు చెప్పడంతో రైతులు అటువైపుగా చూస్తున్నారు. 120 రోజుల కాలవ్యవధిలో చేతికొచ్చే పంట రకాలు ఆర్ఎన్ఆర్, తెలంగాణ సోనా రకాలపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇది కూడా వేయలేకపోతే తక్కువ నీటి తడులతో పండే పంటలైన జొన్న, శనగ, పెసర, బొబ్బెర, కూరగాయల పంటలు సాగు చేయాలని బోర్లు, బావుల కింద ఉన్న రైతులు ఆలోచన చేస్తున్నారు.
వర్షాల కోసం ఎదురుచూస్తున్నాం..
గతేడాది ఇదే సమయానికి భారీ వర్షాలు కురిశాయి. ఇప్పటికే దుక్కులు దున్ని విత్తనాలు సైతం వేసినం. కానీ, ఎల్‌నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. రఘునాథపాలెం మండలంలో ఇప్పటివరకు సరైన వర్షం పడిందిలేదు. వ్యవసాయ అధికారుల సూచనల మేరకు సాగుచేసే విషయమై ఆలోచన చేస్తున్నాం. ఏదేమైనా ఈ ఏడాది ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి. వర్షం లేదు. ఎండలు ఎక్కువగా ఉన్నాయి, విత్తనాలు విత్తితే వట్టిపోతాయనే భయంలో ఉన్నాం.
– మద్దాల శ్రీను, రైతు, కోయచలక, రఘునాథపాలెం మండలం
ఆరుతడి పంటలు వేద్దామనుకుంటున్నా..
వర్షాలు కురవని కారణంగా ఆరుతడి పంటలు వేయాలనే ఆలోచనలో ఉన్నాం. సరైన వర్షాలు పడినది లేదు. దుక్కులు దున్ని విత్తనాలు వేద్దామంటే భయం వేస్తోంది. ఆరుతడి పంటలు వేస్తేనే మేలని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఈ నెలాఖరు వరకు వర్షాలు పడకపోతే అదే మాకు దిక్కవుతుంది.
– కుర్రా నరేశ్, బాలప్పేట, రైతు, ఖమ్మం నగరం