భద్రాచలం, జూలై 7 : భద్రాది కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన భూములు ఆంధ్రప్రదేశ్లో యథేచ్ఛగా ఆక్రమణకు గురవుతున్నాయి. తాజాగా సోమవారం పురుషోత్తపట్నంలో ఉన్న దేవస్థానం భూముల్లో గ్రామస్తులు అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్న విషయం తెలుసుకున్న ఆలయ అధికారులు అడ్డుకునేందుకు అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడి స్థానిక టీడీపీ నాయకులు, గ్రామస్తులు అధికారులపై తిరగబడ్డారు.
మా భూముల్లోకి, మా రాష్ట్రంలోకి మీరు రావొద్దు, ఏదైనా ఉంటే కోర్టులోనే తేల్చుకోవాలని గొడవకు దిగడంతో అధికారులు స్థానిక యటపాక పోలీసులు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు వచ్చి గ్రామస్తులను సముదాయించినా వారు వినకపోగా దేవస్థానం అధికారులను ఇక్కడ నుంచి వెళ్లాలని పదే పదే నినాదాలు చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు పక్కన ఉండి చూడటం తప్ప ఏమీ పట్టించుకోలేదని భద్రాద్రి దేవస్థానం అధికారులు పేర్కొన్నారు. అనంతరం ఆలయ ఈవో రమాదేవి అధికారులతో ఫోన్లో మాట్లాడటంతో వారు అక్కడ నుంచి వెనుదిరిగారు.
పురుషోత్తపట్నం వాసులు ఆక్రమించుకున్న భద్రాద్రి దేవస్థానం భూములను వెంటనే తిరిగి అప్పగించాలని దేవస్థానం ఏఈవో రామకృష్ణ, ఈఈ రవీందర్లు డిమాండ్ చేశారు. భద్రాచలంలో సోమవారం వారు విలేకర్లతో మాట్లాడుతూ అనేక ఏళ్లుగా భద్రాద్రి రామయ్య భూములను ఆక్రమించుకుంటున్నారని, ఏపీ అధికారులు సైతం స్థానిక గ్రామస్తులకు వత్తాసు పలుకుతున్నారని వాపోయారు. ఇప్పటికే దేవస్థానం భూముల వివాదం ఏపీ హైకోర్టులో పెండింగ్లో ఉండగా మళ్లీ ఆక్రమణలు చోటుచేసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు.