కారేపల్లి, ఆగస్టు 09 : కారేపల్లి మండల కేంద్రంలో అంతర్గత రహదారులు అసంపూర్తిగా మిగిలిపోవడంతో ఆప్రాంత వాసులకు అవస్థలు తప్పడం లేదు. ఆసంపూర్తి రహదారుల మీద నుండి వాహనాలు వెళ్లి కురుకపోతున్నాయి. కారేపల్లి సంత సమీపంలోని గేటుకారేపల్లి రోడ్డు నుండి పాత సొసైటీ కార్యాలయం వరకు పురాతన కాలం నుండి ఉన్న రహదారిని గ్రామస్తులు అధికంగా వినియోగిస్తుంటారు. ఆ రహదారి 400 మీటర్లు ఉండగా దానిలో 200 మీటర్లు వరకు అధికారులు సీసీ రోడ్డు వేసి వదిలివేశారు. సింగరేణి ప్రాథమిక పాఠశాల ఎదురుగా సీసీ రోడ్డు పూర్తికాక పోవడంతో ఆ ప్రాంతంలో బురదమయంగా మారి విద్యార్థులతో పాటు ఆ రహదారి వెంట వెళ్లే వారికి అవస్థలు తప్పడం లేదు.
శనివారం ఆ రహదారి మీదుగా దక్షిణ మధ్య రైల్వే ట్రాక్ దిమ్మెల లారీ వెళ్తూ సోసైటీ కార్యాలయం ఎదుట మట్టిలో కురుకుపోయింది. బయటకు తీయడం కష్టంగా మారడంతో రైల్వే సిబ్బంది లారీపై నుండి దిమ్మెలను ప్రత్యేక క్రేన్ ద్వారా క్రిందకు అన్లోడ్ చేసి లారీని బయటకు తీశారు. కారేపల్లి మోడల్ స్కూల్‌కి వెళ్లే రహదారి సైతం అసంపూర్తిగా 50 మీటర్ల రోడ్డు ఆగిపోయింది. ఇప్పటికైనా ఆధికారులు అసంపూర్తిగా మిగిలిన సీసీ రహదారులను వెంటనే పూర్తి చేయాలని కోరుతున్నారు.
Karepalli : కారేపల్లిలో పూర్తికాని అంతర్గత రహదారులు.. వాహనదారుల అవస్థలు