బూర్గంపహాడ్, జూన్ 21 : రేషన్ కార్డుకు సంబంధించి అప్లోడ్ ప్రాసెస్ కోసం ఓ టైపిస్టు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన బూర్గంపహాడ్ తహసీల్దార్ కార్యాలయంలో శనివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలానికి చెందిన ఓ వ్యక్తి రేషన్ కార్డుకు సంబంధించి అప్లోడ్ ప్రాసెస్ కోసం బూర్గంపహాడ్ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్(టైపిస్టు) సీహెచ్.నవక్రాంత్‌ను సంప్రదించాడు.
ఈ క్రమంలో అతడు రూ.4 వేలు డిమాండ్ చేయగా.. రూ.2,500 ఇస్తానని సదరు బాధితుడు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించి పరిస్థితిని వివరించాడు. వారు పన్నిన పథకం ప్రకారం శనివారం కార్యాలయంలో టైపిస్టుకు రూ.2,500 లంచం ఇస్తుండగా అక్కడే మాటువేసిన ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ తన బృందంతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎవరైనా లంచం అడిగితే 1064 లేదా 9154388981 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని, వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని డీఎస్పీ రమేశ్ తెలిపారు. కాగా.. ఏడాది క్రితం తహసీల్దార్ కార్యాలయంలో టైపిస్టుగా విధుల్లో చేరిన నవక్రాంత్ వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చేవారి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు పలు ఆరోపణలున్నాయి.
పదకొండేళ్లలో మూడుసార్లు దాడులు
బూర్గంపహాడ్ తహసీల్దార్ కార్యాలయంలో 11 ఏళ్ల కాలంలో ఏసీబీ అధికారులు మూడుసార్లు దాడులు నిర్వహించారు. 2014లో అప్పటి ఇన్చార్జి తహసీల్దార్ సుంకర శ్రీనివాస్, టైపిస్టు దినేశ్‌లు నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామానికి చెందిన రైతు భూమికి సంబంధించి ఆన్లైన్ చేయడం కోసం లంచం తీసుకుంటుండగా అప్పటి ఏసీబీ డీఎస్పీ సాయిబాబా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
2018లో డీటీగా పనిచేస్తున్న భరణిబాబు సారపాక భాస్కర్‌నగర్ ప్రాంతంలో డబుల్ బెడ్రూం ఇళ్లకు ఇసుక తోలకాలకు అనుమతి ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేయగా ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. అదే అధికారి ఇటీవల చర్లలో విధులు నిర్వహిస్తుండగా మరోసారి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. తాజాగా ఏసీబీ అధికారులు టైపిస్టు నవక్రాంత్ లంచం తీసుకుంటుండగా పట్టుకొని అరెస్టు చేశారు.