చండ్రుగొండ/ బూర్గంపహాడ్, మే 2: పిడుగుపాటుతో వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు మృతిచెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలు భద్రాద్రి జిల్లా చండ్రుగొండ, బూర్గంపహాడ్ మండలాల్లో శనివారం చోటు చేసుకున్నాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. చండ్రుగొండ మండలం గానుగపాడుకు కొండ్రు వినోద్ (28) ఓ ఫర్టిలైజర్ కంపెనీలో ఫీల్డ్ స్టాఫ్‌గా పని చేస్తున్నాడు.
ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం గ్రామ శివారులోని పంట చేలను చూసేందుకు వెళ్లగా ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. దీంతో తడవకుండా ఉండేందుకు చేను పక్కనే ఉన్న చెట్టు కిందకు వెళ్లాడు. అప్పటికే రైతు కాంతారావు, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ రాజశేఖర్, వ్యవసాయ కూలీ తీట్ల అశోక్ అదే చెట్టు కింద ఉన్నారు. ఈ క్రమంలో చెట్టు సమీపంలో ఒక్కసారిగా పిడుగు పడడంతో నలుగురికి గాయాలయ్యాయి. గ్రామస్తులు వెంటనే 108 వాహనంలో ముగ్గురిని కొత్తగూడేనికి, కాంతారావును చండ్రుగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే కొత్తగూడెం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వినోద్ మృతిచెందినట్లు అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. మరో ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉంది. అలాగే బూర్గంపహాడ్ మండలం ఇరవెండికి చెందిన మాజీ వార్డు సభ్యుడు సోడె గోపయ్య(50) తన చేనులో నువ్వులు ఆరబోస్తున్నాడు. ఈ క్రమంలో ఉరుములు మెరుపులతో ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో గోపయ్య అక్కడికక్కడే కుప్పకూలిపోయి మృతిచెందాడు.