ఖమ్మం, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో పామాయిల్ సాగు విస్తరణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆయిల్‌పాం సాగు.. ఆ రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని అన్నారు. రైతులు ఆయిల్‌పాం సాగువైపు మొగ్గు చూపేందుకు అధికారులు దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రిగా హైదరాబాద్‌లోని సచివాలయంలో శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజే తుమ్మల మూడు కీలక దస్ర్తాలపై సంతకాలు చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో రూ.1,050 కోట్లతో ఐదు పామాయిల్ పరిశ్రమలు స్థాపించే ఫైళ్లపై తొలి సంతకం చేశారు. అలాగే, రాష్ట్రంలో 110 రైతువేదికల్లో వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించేలా రూ.4.07 కోట్లతో సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టే పనుల పైళ్లపై రెండో సంతకం చేశారు. అదేవిధంగా, సహకార వ్యవస్థలో పారదర్శకమైన పాలన అందించేందుకుగాను వివిధ విభాగాలను పూర్తిగా కంప్యూటరీకరణ చేసేందుకు అవసరమైన చర్యల కోసం మూడో దస్త్రంపై సంతకం చేశారు.
రాష్ట్రంలోని సహకార కమిషనర్, రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీతో పాటు జిల్లా సహకార కార్యాలయాల్లో అన్ని రకాల కార్యకలాపాలను కంప్యూటరీకరించాలని అధికారులకు మంత్రి తుమ్మల సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో ఏడాదికి ఒకటి చొప్పున పామాయిల్ పరిశ్రమలను ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో నెలకొల్పుతామని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోకుండా తెగుళ్ల దాడుల ప్రమాదాలను తగ్గించడం వంటివి పామాయిల్ సాగులోనే సాధ్యమవుతాయని అన్నారు. 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు దిగుబడినిచ్చే దీర్ఘకాలిక పంటగా రైతుకు స్థిరమైన ఆదాయం ఇస్తుందన్నారు. సంప్రదాయ పంటలతో పోలిస్తే పామాయిల్ సాగుతో రైతులు ఎకరాకు రూ.లక్ష వరకు ఆదాయం సమకూరుతుందని అన్నారు. ఇంకా అంతరపంటలతో అదనపు ఆదాయం లభిస్తుందని అన్నారు. ఆయిల్‌ఫెడ్ 2023-24 నుంచి ఏటా 40 వేల ఎకరాల విస్తీర్ణం పెంచేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రి తుమ్మల తెలిపారు.