కారేపల్లి, అక్టోబర్ 16 : బీసీ సంఘాల ఐక్య వేధిక ఈ నెల 18న ఇచ్చిన రాష్ట్ర బంద్కు తుడుందెబ్బ మద్దతు ఇస్తుందని ఆ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బచ్చలి వెంకటేశ్వర్లు, కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్తి రాంప్రసాద్ తెలిపారు. భారతదేశంలో ఆర్థిక, రాజకీయ, సాంఘిక అసమానతల కారణంగా 1952లో రాజ్యాంగ నిర్మాణ కర్తలు రిజర్వేషన్లు రాజ్యాంగంలో పొందుపరిచారన్నారు. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు కొంత ఉపశమనం కల్గిందన్నారు. దీనితోనే సంపూర్ణ సామాజిక న్యాయం జరగదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు నేటికి మరింత వెనకబడి ఉన్నారని, జనాభా ప్రాతిపదికగా రిజర్వేషన్ హక్కులు, ఉపాధి, ఉద్యోగాలు, విద్యా, రాజకీయ పదవుల్లో తగిన భాగస్వామ్యం దక్కడం సామాజిక న్యాయమని పేర్కొన్నారు.