ఇల్లెందు, నవంబర్ 22: కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇల్లెందు కొత్త బస్టాండ్ సెంటర్లో టీయూసీఐ ఆధ్వర్యంలో నాయకులు గెజిట్ చేసిన లేబర్ కోడ్ ప్రతులను, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను శనివారం దహనం చేసిన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా కార్యదర్శి షేక్ యాకూబ్ షావలీ, ఇల్లెందు ఏరియా కార్యదర్శి మల్లెల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను తెస్తూ ఉత్తర్వులు జారీ చేయడం సమంజసం కాదన్నారు.
వలస పాలనకు మించి బానిసత్వాన్ని కార్మిక వర్గాలపై రుద్దేందుకు, కార్పొరేట్లకు కట్టు బానిసలుగా చేసేందుకే లేబర్ కోడ్లను తీసుకొచ్చారని మండిపడ్డారు. లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలను కార్మిక సంఘాలతో కలిసి ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నాయకులు బోళ్ల సీతారాములు, బొల్లి రవి, కే.వీరన్న, పిల్లి మల్లేశ్, వార శ్యాం, సంపత్, కార్మికులు పాల్గొన్నారు.