మధిర, జూలై 21: కాంగ్రెస్ పార్టీది కర్షకులను నష్టపరిచే విధానమని టీఎస్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు విమర్శించారు. తెలంగాణ వచ్చాక నిరంతర విద్యుత్‌ను అందిస్తామని ఆనాడు ఉద్యమనేత కేసీఆర్ చెప్పినప్పుడు కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేశారని గుర్తుచేశారు. అదే కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ సాధించి ముఖ్యమంత్రిగా ఉండి అంతరాయం లేని కరెంటు అందిస్తుంటే ఇదే కాంగ్రెస్ నేతలు తెల్లమొహం వేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయనికి అందిస్తున్న 24 గంటల ఉచిత కరెంటును ఓర్వలేకనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ పిలుపు మేరకు బోనకల్లు రైతువేదికలో శుక్రవారం నిర్వహించిన రైతు సమావేశంలో ఆయన మాట్లాడారు. పంటల సాగుకు 24 గంటల కరెంటు అవసరం లేదని, మూడు గంటల విద్యుత్ సరిపోతుందని రైతులను మళ్లీ కష్టాలపాలు చేయాలని చూస్తున్నారని విమర్శించారు. రైతుబంధు సమితి ఖమ్మం జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరెంటు కష్టాలు తీర్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు మిగిల్చిన అంధకారాన్ని తొలగిస్తూ సీఎం కేసీఆర్ విద్యుత్ వెలుగులు పంచుతున్నాని అన్నారు. నేడు రాష్ట్రంలో 20 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పిత్తి చేస్తున్నారని అన్నారు. 30 లక్షల వ్యవసాయ బోర్లకు 24 గంటలూ నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందిస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు బంధం శ్రీనివాసరావు, చేబ్రోలు మల్లికార్జునరావు, వేమూరి ప్రసాద్, బాణోతు కొండా, చావా వెంకటేశ్వరరావు, చావా ప్రసాద్, కాకాని శ్రీనివాసరావు, తమ్మారపు బ్రహ్మయ్య, మోర్ల నరసింహారావు, భాగం మధుసూదన్‌రావు, గుండపునేని సుధాకర్‌రావు, మంకెన రమేశ్, మోదుగుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.