పెనుబల్లి, ఫిబ్రవరి 23: ‘దేశ్ కీ నేత కేసీఆర్’ అని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాష్ర్టాల ప్రజలూ సీఎం కేసీఆర్ వైపే చూస్తున్నారని, ఆయన పాలనను, ఇక్కడి పథకాలను వారు కోరుకుంటున్నారని అన్నారు. తమను తెలంగాణలో కలపాలంటూ పొరుగు రాష్ర్టాల్లోని సరిహద్దు గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారని గుర్తుచేశారు. మండలంలోని తెలగవరం, పాతాకారాయిగూడెం, అడవిమల్లేల, సూరయ్యబంజరతండ, కొత్తకారాయిగూడెం, పాతకుప్పెగుంట్ల, బయ్యన్నగూడెం గ్రామాల్లో వారు గురువారం పర్యటించారు. సీసీ రోడ్లు, పంచాయతీ కార్యాలయాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ నామా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంపై కక్ష పెంచుకున్న ప్రధాని మోదీ.. ఇక్కడి అభివృద్ధిని ఓర్వలేకపోతున్నారని, అందుకే విషం చిమ్ముతున్నారని అన్నారు.
బీఆర్ఎస్ ఎదుగుదల ఓర్వలేక ప్రధాని.. రాష్ట్ర ఆర్థిక మూలాలపై దెబ్బతియాలనే ఉద్దేశంతోనే బడ్జెట్లో తెలంగాణకు మొండిచెయ్యి చూపారని విమర్శించారు. మతోన్మాద శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణ ప్రజలందరూ కేసీఆర్ వెంట నడవాలని ఆకాంక్షించారు. అనం తరం ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ.. ఉద్యమాల నుంచి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు.. తెలంగాణ ప్రజలకు ఏమి కావాలో తెలుసునని అన్నారు. వారి సంక్షేమానికి అవసరమైన పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం రంగం సాధించిన ప్రగతే ఇందుకు నిదర్శనమని అన్నారు. మండలానికి వచ్చిన ఎంపీ నామా, ఎమ్మెల్యే సండ్రలకు అన్ని గ్రామాల్లోనూ ప్రజలు పూలు చల్లుతూ స్వాగతం పలికారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సూర్యనారాయణ, నల్లమల వెంకటేశ్వరరావు, లక్కినేని అలేఖ్య, చెక్కిలాల మోహన్‌రావు, ఎం.రమాదేవి, కావూరి మహాలక్ష్మి, మందడపు అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.