అశ్వారావుపేట, జూన్ 10: సర్వే నంబర్లు 30, 36, 39లలోని భూములను సర్వే చేసి తిరిగి తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ అశ్వారావుపేట తహసీల్దార్, అటవీ శాఖ కార్యాలయాల ఎదుట రామన్నగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీలు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష మంగళవారం రెండో రోజుకు చేరింది. మొదటిరోజు దీక్షలో భాగంగా ఆదివాసీలు తహసీల్దార్, అటవీ శాఖ కార్యాలయం ఎదుట శిబిరంలోనే సోమవారం రాత్రి నిద్రించారు. మంగళవారం కళ్లకు నల్లరిబ్బన్లు కట్టుకొని నిరసనకు దిగారు. ఈ క్రమంలో మధ్యాహ్నం డీఎఫ్‌వో కృష్ణాగౌడ్, ఎఫ్‌డీవో దామోదర్‌రెడ్డి, ఎఫ్డీసీ డీఎం గణేశ్, తహసీల్దార్ రామకృష్ణలు దీక్షలో కూర్చున్న ఆదివాసీలతో చర్చలు జరిపారు.
పాత పట్టాలతో తమకు సంబంధం లేదని, ధరణి పాస్ పుస్తకాలు ఉంటే చూపించాలని సూచించారు. కోర్టులో కేసు ఉండగా.. ఎలాంటి చర్యలు తీసుకోలేమని అధికారులు చెప్పారు. దీంతో ఆగ్రహించిన ఆదివాసీలు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదివాసీలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న సీఐ నాగరాజు ఘటనా స్థలానికి చేరుకుని గిరిజనులతో చర్చించారు. ఏమైనా సమస్యలు ఉంటే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని, ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దని సూచించారు. దీంతో రాస్తారోకో విరమించిన ఆదివాసీలు నేరుగా కలెక్టరేట్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
సాయంత్రం పాదయాత్రగా బాధిత గిరిజన కుటుంబాలు కొత్తగూడెం కలెక్టరేట్‌కు బయలుదేరారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంఘం నాయకుడు మడకం నాగేశ్వరరావు మాట్లాడుతూ రామన్నగూడెంలోని సర్వే నెంబర్లు 30, 36,39లలో పూర్వం రెవెన్యూ అధికారులు ఇచ్చిన పట్టా భూములను అటవీ శాఖ తమ ఆధీనంలోకి తీసుకున్నదని, తిరిగి తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. కొన్నేళ్లుగా ఈ భూముల కోసం పోరాటాలు చేస్తున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, హైకోర్టు, కలెక్టర్, ఐటీడీఏ పీవో, రెవెన్యూ, అటవీ శాఖలు ఉమ్మడి సర్వే చేసి భూ సమస్యను పరిష్కరించాలని సూచించినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ భూములైతే 1986, 1994, 1998లో రెవెన్యూ అధికారులు ఫైనల్ పట్టాలు ఎలా జారీ చేశారని ఆయన ప్రశ్నించారు.
ఈ భూముల విషయమై ఎప్పుడు అధికారులను కలిసినా 10 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారే తప్ప పట్టించుకోవడం లేదన్నారు. సమస్యపై ఈ నెల 5న రెవెన్యూ, అటవీ శాఖ అధికారులకు వినతిపత్రాలు అందించామని, స్పందన లేకపోవడంతో సోమవారం నుంచి నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టినట్లు వివరించారు. భూములు అప్పగించే వరకు దీక్ష విరమించేది లేదని తేల్చిచెప్పారు. ఈ విషయమై ఎఫ్‌డీవో దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ ఆదివాసీలు చెబుతున్న భూమి అంతా అటవీ శాఖదేనని, పైగా దీనిపై కోర్టులో కేసు ఉన్నదని సమాధానమిచ్చారు. రామన్నగూడేనికి చెందిన ఆదివాసీలు, బాధిత కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు.