సత్తుపల్లిటౌన్, జూన్ 8 : ట్రెంచ్ను పూడ్చివేసి పోడు సాగు చేసుకుంటున్న గిరిజనులను అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడంతో వివాదం నెలకొంది. దీంతో ఇద్దరు గిరిజనులను అదుపులోకి తీసుకోవడంతో తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటన సత్తుపల్లి మండలం కాకర్లపల్లి బీట్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది.
వివరాలు ఇలా ఉన్నాయి. కాకర్లపల్లి బీట్ పరిధి తామర చెరువు సమీపంలోని కంపార్ట్మెంట్ నెంబర్ 157లోని సుమారు 10.5 హెక్టార్లు ప్రభుత్వ భూమేనని అటవీ శాఖ అధికారులు చెబుతుండగా.. అది ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తమదేనని గిరిజనులు వాదిస్తున్నారు. ఈ క్రమంలో గిరిజనులు అటవీ భూముల్లోకి ప్రవేశించకుండా అటవీ శాఖ అధికారులు ఇటీవల ట్రెంచ్ కొట్టారు. అయితే పోడు సాగుదారులు సోమవారం ఆ ట్రెంచ్ను పూడ్చివేసి అటవీ భూముల్లోకి ప్రవేశించి పోడు కొడుతున్నారు.
సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని గిరిజనులను వారించి, అందులోని మారుతి వెంకటేశ్వర్లు, మారుతి రజినిలను అదుపులోకి తీసుకున్నారు. వారిని జీపులో తరలించేందుకు యత్నించగా అక్కడే ఉన్న గిరిజన మహిళలు జీపుకు అడ్డంగా నిలబడి నిరసన తెలిపారు. కొందరు వెనుక నుంచి జీపును నెట్టారు. ఈ క్రమంలో కొందరు గిరిజనులు కిందపడటంతోపాటు ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. మహిళా అటవీ శాఖ అధికారి చేతికి గాయమైంది. అనంతరం అటవీ శాఖ అధికారులు గిరిజనులను అక్కడి నుంచి పంపించారు.