కారేపల్లి, సెప్టెంబర్ 13 : గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్లో పని చేస్తున్న డైలీ వేజ్ వర్కర్లను పర్మినెంట్ చేయడంతో పాటు జీఓ 64 అమలును నిలిపివేసి పాత పద్ధతిలోనే, జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు చెల్లించాలని, అలాగే పెండింగ్ వేతనాలు చెల్లించాలని అఖిల భారత కార్మిక సంఘం (ఐఎఫ్టీయూ) ఖమ్మం జిల్లా నాయకుడు భూక్య శివనాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలో గల శాంతినగర్ ఆశ్రమ పాఠశాల ముందు శనివారం దీక్షా శిబిరం ఏర్పాటు చేశారు. కామేపల్లి, కారేపల్లి మండలాలకు చెందిన ఆశ్రమ పాఠశాలల కార్మికులు పాల్గొన్నారు. జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ దీక్షలో భూక్య శివ నాయక్ పాల్గొని మాట్లాడారు.
గిరిజన ఆశ్రమ పాఠశాల హాస్టల్స్లో పని చేస్తున్న డైలీ వేజ్, పార్ట్ టైం వర్కర్లకు గత 30 సంవత్సరాలుకు పైగా జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు చెల్లిస్తున్నారు. కానీ ఇప్పుడు 2021 జూన్ 15వ తేదీన ఆర్థిక శాఖ విడుదల చేసిన జీఓ 64 ప్రకారం వేతనాలు చెల్లించాలని మౌలిక ఆదేశాలు జారీ చేశారు. దాని ఫలితంగా వేతనాలు బాగా తగ్గుతున్నాయని, కావున జీఓ 64 అమలును నిలిపి వేయాలని ఇప్పుడు చెల్లిస్తున్న విధంగానే జిల్లా కలెక్టర్ కనీస వేతనాల సర్కూలర్ గెజిట్ ప్రకారం యధావిధిగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా 2021లో ఇచ్చిన జీఓ నెంబర్ 64ను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం వల్ల గిరిజన కార్మిక వేతనాలకు నెలకు రూ.4 వేల నుండి రూ.15 వేల వరకు తగ్గుతున్నాయన్నారు.
ఫలితంగా ఖమ్మం జిల్లాలో ఒక్కొక్క వర్కర్ సుమారుగా రూ.45 వేల నుండి రూ.లక్ష వరకు నష్టపోతున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి తక్షణమే స్పందించి న్యాయమైన పోరాటం చేస్తున్న హాస్టల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మికులు బానోత్ నందియా, మాతృ, గురువమ్మ, పద్మ, శ్రీను, అనంత రాములు, రాధమ్మ, బుజ్జయ్య, స్వరూప, నాగయ్య, కళావతి, బాబు సింగ్ పాల్గొన్నారు.