ఇల్లెందు రూరల్, డిసెంబర్ 28 : సుదిమల్లలోని గిరిజన బాలికల గురుకుల కళాశాలలో ఏడవ రాష్ట్రస్థాయి గిరిజన గురుకులాల బాలికల క్రీడా పోటీలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పోటీలను ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ టి.వెంకటేశ్వరరాజు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అండర్-14, 17, 19 విభాగాలవారీగా ఈ నెల 31వ తేదీ వరకు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఒక్కో జోన్ నుంచి 300 మంది క్రీడాకారుల చొప్పున నాలుగు జోన్లకు కలిపి 1,200 మంది వివిధ అంశాల్లో నిర్వహించే పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కబడ్డీ, వాలీబాల్, ఖో-ఖో, టెన్నికాయిట్, హాకీ, క్యారమ్స్, బాల్ బ్యాడ్మింటన్, బాక్సింగ్, హ్యాండ్‌బాల్, 100, 200, 1,500 మీటర్ల పరుగుపందెం, లాంగ్‌జంప్, హైజంప్, 600, 400 మీటర్స్ రిలే తదితర విభాగాల్లో పోటీలు ఉంటాయని తెలిపారు.
క్రీడాకారులతో భోజన వసతితోపాటు కల్పించినట్లు వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ అరుణకుమారి మాట్లాడుతూ నాలుగు జోన్ల రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు సుదిమల్ల గిరిజన గురుకుల బాలికల కళాశాల వేదిక కావడం గర్వంగా ఉందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సెక్రటరీ శ్రీనివాస్‌రెడ్డి, వోఎస్డీ శ్రీనివాస్, డి.శ్రీనివాస్‌కుమార్, గిరిజన క్రీడాల అధికారి రవికుమార్, వివిధ జిల్లాలకు చెందిన రీజినల్ అధికారులు వెంకన్న, సంపత్, లక్ష్మయ్య, నాగార్జున్, పీడీలు, పీఈటీలు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.