ఖమ్మం అర్బన్, ఆగస్టు 18 : విద్యార్థులకు ఉపాధ్యాయులు ఎలా పాఠాలు బోధించాలో, డీఈడీ అభ్యర్థులు ఉపాధ్యాయ వృత్తిని ఎలా అభ్యసించాలో ట్రైనింగ్ ఇచ్చే శిక్షణ సంస్థకు దిక్కు లేకుండా పోయింది. టీచర్లలో ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుతూ వారిలో నైపుణ్యాలు పెంపొందించే ఖమ్మం జిల్లా విద్య, శిక్షణ సంస్థ (డైట్)కు బాస్ లేకపోవడంతో అది అరిగోస పడుతోంది. సీవోఈ పేరిట రూ.కోట్ల పనులు జరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. రాష్ట్రంలో ఎంపిక చేసిన రెండు సీవోఈ (సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్)ల్లో ఒకటైన ఖమ్మం డైట్ (డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్)కు ప్రిన్సిపాల్‌ను నియమించలేకపోవడం విద్యాశాఖ దుస్థితికి అద్దం పడుతోంది.
ఖమ్మం డైట్ ప్రిన్సిపాల్ ఉద్యోగ విరమణ చేసి సుమారు 20 రోజులవుతున్నా ఎవరూ బాధ్యతలు చేపట్టే చర్యలు తీసుకోలేదంటే విద్యాశాఖ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతోంది. పైగా, ప్రిన్సిపాల్‌గా ఇన్చార్జి బాధ్యతలు చేపట్టేందుకు కూడా అందుకు అవసరమైన ఉత్తీర్ణత కలిగిన రెగ్యులర్ లెక్చరర్ కూడా అక్కడ లేకపోవడం గమనార్హం. దీంతో డైట్లో చదువుతున్న డీఈడీ విద్యార్థులకు భరోసా ఇచ్చే బాధ్యుడు లేని దుస్థితి నెలకొంది.
ఖమ్మంలోని డైట్ ఈఎల్టీసీలో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, గెస్ట్ ఫ్యాకల్టీ విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో ఒక్కరు కూడా గెజిటెడ్ హోదా ఉన్న వారు కాదు. దీంతో ఇటీవల మహబూబ్‌నగర్ డైట్ సీవోఈ కళాశాల ప్రిన్సిపాల్‌కి ఖమ్మం డైట్ ప్రిన్సిపాల్‌గా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. కానీ తాను ఖమ్మంలో బాధ్యతలు స్వీకరించలేనని ఉన్నతాధికారులకు ఆయన స్పష్టం చేశారు. దీంతో డైట్ పరిస్థితి మళ్లీ డోలాయామనంలో పడింది. ఈ నెల వేతనాలు పొందాలంటే మరో నాలుగైదు రోజుల్లో బిల్లులు ట్రెజరీలో సమర్పించాల్సి ఉంటుంది. ఇన్చార్జిగా ఎవరినైనా నియమించినా వాళ్ల సిగ్నేచర్ ట్యాలీ అవ్వాలి. ఇతర సాంకేతక అంశాలూ ఉంటాయి.
ఈ నేపథ్యంలో డైట్లో పనిచేస్తున్న ఈఎల్టీసీలో పనిచేస్తున్న స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఈ నెల వేతనాలు తీసుకోవడం కష్టమే. డైట్లో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన సీనియర్ అధ్యాపకుల మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. పైనుంచి అవి అనుమతి పొందినా డైట్లో వాటిని ఆమోదించే వారు లేకపోవడంతో ఆ బిల్లులన్నీ ఇక్కడ ఆగిపోయాయి. దీంతో సంబంధిత అధ్యాపకులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. త్వరలో డైట్‌కి ఎవరినీ నియమించని పరిస్థితుల్లో డైట్ సిబ్బంది కలెక్టర్‌ను కలిసేందుకు సమాయత్తమవుతున్నారు. వేతనాలు జమకాకపోతే ఈఎంఐల చెల్లింపుల్లో ఇబ్బందులు, ఇతరత్రా సమస్యలు ఉత్పన్నమవుతాయని గోడు వెళ్లబోసుకునేందుకు కలెక్టర్‌ను కలవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఖమ్మం డైట్ సీవోఈగా మారుతుందని, అత్యుత్తమ సదుపాయాలు ఈ విద్యాసంవత్సరం నుంచే కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేయడంతో 180 మంది విద్యార్థులు ఈ సంవత్సరంలో ప్రవేశాలు పొందారు. వీరు క్యాంపస్‌లోనే ఉండేందుకు మెన్స్, ఉమెన్స్ హాస్టళ్ల భవనాలు దాదాపు సిద్ధమయ్యాయి. 20 రోజుల నుంచి ప్రిన్సిపాల్ లేకపోవడంతో విద్యార్థుల సందేహాలు నివృత్తి చేసేందుకు అవకాశం లేకపోయింది. ప్రిన్సిపాల్ లేని కారణంగా భోజనం సహా ఇతర సదుపాయాలపై కూడా ఎలాంటి స్పష్టతా లేదు. దీంతో విద్యార్థులు నిత్యం అక్కడ పనిచేస్తున్న అధికారులను ప్రశ్నిస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో ఎంఈడీ అర్హత ఉన్న రెగ్యులర్ ఎంఈవోకు డైట్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్‌గా అదనపు బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉన్నతాధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఇద్దరు మాత్రమే రెగ్యులర్ ఎంఈవోలు ఉన్నారు. వీరిలో ఒకరు ఖమ్మం రూరల్ మండలంలో, మరొకరు రఘునాథపాలెం మండలంలో పనిచేస్తున్నారు. డైట్ కళాశాలకు దగ్గరలో రఘునాథపాలెం మండలం ఉండడంతో అతడికే అదనపు బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.