ఖమ్మం రూరల్: తాటిచెట్టుపై నుంచి పడి గీతకార్మికుడు (Toddy toper ) మృతిచెందిన ఘటన మండలంలోని చింతపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన ఎనిగళ్ల వీరభద్రం (48) గత కొన్నేళ్లుగా తాడిచెట్లు ఎక్కూతూ జీవనం సాగిస్తున్నాడు. రోజూ మాదిరిగానే ఆదివారం సాయంత్రం తాడిచెట్టు ఎక్కి కల్లు తీస్తుండగా ఒక్కసారిగా మోకు జారి కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు.
ఇంటి పెద్దను కోల్పోవడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు. విషయం తెలుసుకున్న పలువురు నాయకులు, గౌడ సంఘ ప్రముఖులు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.