ఖమ్మం వ్యవసాయం, జూలై 29: పంటల రుణమాఫీ రెండో విడత నిధులు మంగళవారం విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటల సమయంలో సీఎం రేవంత్రెడ్డి.. రైతుల రుణ ఖాతాల్లో నిధులు జమ చేసే ప్రక్రియను హైదరాబాద్ నుంచి ప్రారంభిస్తారు. తొలి విడత నిధుల విడుదల కార్యక్రమం తరహాలోనే రెండో విడతలో కూడా ప్రత్యక్ష కార్యక్రమాన్ని రైతులు వీక్షించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కలిగిన 21 రైతువేదికలను సిద్ధం చేశారు. ప్రతి మండలానికీ ఒకటి చొప్పున ఏర్పాటు చేసిన అధికారులు..
ఈ కార్యక్రమానికి మరోసారి ఆయా క్లస్టర్ల పరిధిలోని రైతులను తీసుకురానున్నారు. జిల్లాలో రూ.లక్షలోపు పంట రుణాలు తీసుకున్న 59,172 మంది రైతులకు గాను రూ.264.23 కోట్లను తొలి విడతలో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిన విషయం విదితమే. అయితే, రూ.లక్షలోపు పంట రుణాలు తీసుకున్న ఇంకా చాలామంది రైతులకు రుణమాఫీ కాలేదు. వివిధ సాంకేతిక కారణాలు, ఒకటికంటే ఎక్కువ బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడం వంటి కారణాల వల్ల మాఫీ రాలేదని, రెండో జాబితాలో తప్పకుండా పేరు వస్తుందని రైతులకు అధికారులు చెబుతున్నారు. అయితే, మొదటి విడతలో రుణాలు మాఫీకాని అర్హత కలిగిన రైతులకు రెండో విడతలో అయినా మాఫీ అవుతుందో లేదో చూడాలి. కాగా, రెండో విడతలో 34,116 మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ నగదు జమ కానుంది.