ఖమ్మం కల్చరల్, మే 7: కనిపించే దైవం అమ్మ. ఆత్మీయత, అనురాగం, త్యాగానికి చిరునామా ఆమె.. అమ్మ పిలుపులోని కమ్మదనం, తీయదనం మాటల్లో చెప్పలేనిది. బుడి బుడి అడుగుల నుంచే నడతను ఆ తర్వాత భవితను నిర్దేశించేది అమ్మే. ఏ చిన్న తప్పు చేసినా కరుణించి కడుపులో దాచుకుని కనికరించే మాతృమూర్తి ఆమె. కన్నపేగుకు ఏ చిన్న కష్టమొచ్చినా తల్లిడిల్లిపోతుంది. భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడని పెద్దలంటారు. అది అక్షరాలా నిజమని వేరే చెప్పనక్కర్లేదు. లోకాన్ని పరిచయం చేసే తొలి గురువుగా, మార్గదర్శిగా ప్రతి అడుగులో అన్నీ తానవుతుంది అమ్మ. బిడ్డకు జన్మనివ్వడానికి చచ్చిపుడుతుంది. పొత్తిళ్లల్లో పసికందును చూసి ప్రసవ వేదననూ మరిచిపోతుంది. అలాంటి మాతృదేవతలందరికీ నేడు మాతృదినోత్సవం సందర్భంగా వందనం. అమ్మ ఇచ్చిన ప్రోత్సాహాన్ని, స్ఫూర్తిని అందుకుని జీవితంలో ఎదిగిన వారి అభిప్రాయాల మాలికతో ‘నమస్తే’ ప్రత్యేక కథనం.
‘మదర్ ఆఫ్ గాడ్స్ ’ అని రియా దేవత పేరు. ఆమెకు నివాళి అర్పించే నేపథ్యంలోనే గ్రీస్ దేశంలో మొదటిసారి వేడుక జరిగింది. 17వ శతాబ్దంలో ఇంగ్లాండులో నాటి పాలకులు తల్లుల గౌరవార్థం ‘మదరింగ్ సండే’ నిర్వహించారు. 1872లో అమెరికాలో జూలియావర్డ్ హోవే అనే మహిళ తొలిసారిగా ప్రపంచశాంతి కోసం మాతృదినోత్సవాన్ని నిర్వహించాలని ప్రతిపాదించారు. ‘మదర్స్ ఫ్రెండ్ షిప్ డే ’ నిర్వహించిన అన్నా మేరీ జెర్విస్ అనే మహిళ 1905 మే 9న చనిపోయింది. ఆమె కుమార్తె మిస్ జెర్విస్ మాతృదినోత్సవం నిర్వహించాలని కోరడంతో ఏటా మే రెండో ఆదివారం నాడు మాతృదినోత్సవం నిర్వహించాలని నిర్ణయించారు. 1910లో తొలిసారిగా వర్జీనియాలో వేడుకలు జరిగాయి. మిస్ జెర్విస్ చేసిన ప్రచారం ఫలితంగా తదుపరి ఏడాది అమెరికాలోని అన్ని రాష్ర్టాల్లో 1914లో నాటి దేశాధ్యక్షుడు ఉడ్రో విల్సన్ మాతృదినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించారు. అప్పటి నుంచి అమెరికాలోనే కాక ప్రపంచ దేశాల ప్రజలంతా ఏటా మే రెండో ఆదివారం మాతృదినోత్సవం నిర్వహిస్తున్నారు.
చాలామంది కుటుంబాల్లో ఆడపిల్లలకు చదువు వద్దు. ఈడు వచ్చాక పెళ్లిచేసి పంపింస్తే బాధ్యత తీరిపోతుందని భావిస్తారు. కానీ నేను చదువుకోవడానికి అమ్మే కారణం. నా ఎదుగుదలకు ఆమె ఎంతో ప్రోత్సాహాన్నిచ్చింది. నా కాళ్లపై నేను నిలబడే ధైర్యాన్నిచ్చింది. నేను ఈరోజు ఎస్సై కొలువు సాధించి వృత్తిలో రాణిస్తున్నానంటే ఆమె తోడ్పాటు ఎంతో ఉంది.
– ఎస్కే జుబేదా బేగం, టూ టౌన్ ఎస్సై, కొత్తగూడెం
నన్ను, నా జీవితాన్ని నిలబెట్టిన అమ్మ రత్నజానాబాయి ప్రేమ వెల కట్టలేనిది. కవిగా, రచయితగా అధ్యాపకుడిగా రాణిస్తున్నానంటే.. ఆమె ఆశీస్సులే కారణం. ఎప్పటికప్పుడు నా మనసును గ్రహిస్తూ అవసరాలను తీర్చింది అమ్మ. ఆమె సేవలు అనన్యం. నా జీవన గమనానికి ఆమె పెద్ద బాలశిక్ష. ఆశావహ దృక్పథం అలవడడానికి, తెలుగు సాహిత్యం వైపు మళ్లడానికి ఆమె నాకు స్ఫూర్తి. ఆమె నేర్పిన జీవన పాఠాలు ఏ విశ్వవిద్యాలయమూ నేర్పలేదు. ప్రతి ఒక్కరి జీవితానికి అమ్మే ప్రాణం.. జీవం.. వేదం.
– అట్లూరి వెంకటరమణ, కవి, ఖమ్మం
జన్మనిచ్చి జీవితాన్నిచ్చిన అమ్మ మోదుగు చుక్కమ్మ అంటే నాకు పంచ ప్రాణాలు. నేను నిరుపేద కళాకారుడిని. అయినా నా కడుపు మాడ్చుకుని అమ్మకు అన్నం పెడుతున్నాను. అనారోగ్యంతో బాధపడుతూ కటిక పేదరికంతో బాధపడుతున్న అమ్మను నేను ఏ నాడూ వీడలేదు. అమ్మను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నా. అవసరమైన మందులు సమకూరుస్తున్నా. నాకు నాలుగు మాటలు రాయడం వచ్చు. పాడే గళం నా సొంతం. జానపద బాణీలో స్టెప్పులేసే శక్తినిచ్చింది అమ్మ. ఇంతకంటే అమ్మకు ఏమివ్వగలను..? ప్రతి రోజు పాదాభివందనం చేసి, కాసేపు అమ్మ ఒడిలో సేద తీరడం తప్ప..!
– మోదుగు గోవింద్, కళాకారుడు, ఖమ్మం
మా అమ్మ సౌభాగ్యమ్మ పది మందికి జన్మనిచ్చింది. ఆమె కడుపులో పుట్టడం నా పూర్వ జన్మ సుకృతం. చిన్పప్పుడు తిన్నామో లేదో తెలియదు. మేము పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. మాది కడు పేద కుటుంబం. అమ్మ సంతానాన్ని ఆదరించింది. మాకు తోడుగా నిలిచింది. ఉన్నత స్థితిని కోరుకుంది. మేం నలుగురు అన్నదమ్ములం. మాకు ఐదుగురు అక్కాచెల్లెళ్లు. అందరం కలిసిమెలిసి ఉన్నాం. నన్ను సమాజానికి సేవ చేయమని చెప్పింది మా అమ్మ. ఆమె సూచనతోనే అన్నం సేవా ఫౌండేషన్ను నిర్వహిస్తున్నా. అనాథలు, అభాగ్యులకు అందిస్తున్న సేవలను చూసి ఎంతో ఆనందపడుతుంది. ప్రోత్సహిస్తుంది. ఆమెకిప్పుడు 92 ఏళ్లు. అమ్మను దేవతలాగా చూసుకుంటున్నా.. నాన్న 2004లో పరమపదించారు.
-డాక్టర్ అన్నం శ్రీనివాసరావు, సామాజిక సేవకుడు, ఖమ్మం
తల్లి ప్రేమ వెల కట్టలేనిది. తల్లి అయితేనే స్త్రీ జన్మకు పరిపూర్ణత లభిస్తుంది. ఆమె పిల్లల కోసం ఎంతటి కష్టాన్నైనా భరిస్తుంది. మా అమ్మ నన్ను ఎంత కష్టపడి పెంచిందో నేను తల్లిగా మారినప్పుడు నాకు అర్థమైంది. తల్లి ప్రేమలోని మాధుర్యం ఎక్కడా దొరకదు. నన్ను ప్రయోజకురాలిని చేసింది అమ్మ. పిల్లలకు తొలి గురువు అమ్మ. ఆమె అడుగుజాడల్లో నడవడంతోనే నేను ఉన్నత స్థానంలో ఉన్నాను. అమ్మ ప్రేమను ఎన్నటికీ మరచిపోను.
-వరలక్ష్మి, జిల్లా సంక్షేమశాఖ అధికారిణి, కొత్తగూడెం
అమ్మ గొప్పతనం, నన్ను ఎంత కష్టపడి పెంచిందో అనే విషయం నేను అమ్మను అయ్యాకే తెలిసింది. నేను పిల్లల సంరక్షణ అమ్మ నుంచే నేర్చుకున్నాను. నేను ఈరోజు పది మందికి పాఠాలు చెప్పే గురువు స్థానంలో ఉండడానికి కారణం మా అమ్మే. నా కుమారులిద్దరూ జీవితంలో ఎదగడానికి నేనూ ఎంతో కృషి చేశా. వారి ఉన్నతిని చూసి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. బిడ్డల ఎదుగుదల వెనుక నాన్న కష్టం ఉన్నప్పటికీ, దాని కన్నా అమ్మ ప్రేమ వారిని ముందుకు నడిపిస్తుంది.
– జె.లక్ష్మి, రుద్రంపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం