పాల్వంచ, ఆగస్టు 4: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి తొలి విద్యుత్ వెలుగులను అందించిన కేటీపీఎస్ ఓఅండ్ఎం కర్మాగారం కూల్చివేత ముగింపు దశకు చేరుకుంది. ఓఅండ్‌ఎంలోని 8 యూనిట్లకు సంబంధించి ఎనిమిది కూలింగ్ టవర్లను ఈ నెల 5వ తేదీ సోమవారం నేలమట్టం చేయనున్నారు. పాత కర్మాగారానికి సంబంధించిన కూల్చివేత, అందులోని మెటీరియల్‌ను తీసుకునే విధంగా ముంబైకి చెందిన హెచ్ఆర్ కమర్షియల్ కాంట్రాక్టు కంపెనీ రూ.465 కోట్లకు టెండర్‌ను దక్కించుకొని పనులు పూర్తిచేసిన విషయం విదితమే.
ఇందులో భాగంగా అప్పటి కర్మాగారానికి సంబంధించిన మెటీరియల్ అంతా సంస్థ తీసుకెళ్లింది. అదేవిధంగా మిగిలిన 8 కూలింగ్ టవర్లను కూల్చివేయడానికి రంగం సిద్ధమైంది. వారంక్రితమే ఈ ప్రక్రియ పూర్తికావాల్సి ఉండగా అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో ఎట్టకేలకు వాయిదా వేశారు. దీనివల్ల ఏమైనా ప్రమాదం ఏర్పడుతుందని భావించి అధికారులు నిలిపివేశారు. పక్కనే పవర్ లైన్‌కు ఏమైనా ఇబ్బందులు వస్తాయని సాకుగా చూపించి ఆపివేశారు. అయితే కూల్చివేతకు అవసరమైన బ్లాస్టింగ్ పరికరాలను అమర్చి సిద్ధమైన తరుణంలో జెన్కో అధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
కూల్చివేత సమయంలో ప్లాంట్‌నుంచి విద్యుత్ సరఫరా చేసే లైన్లలో రెండుగంటలపాటు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని, సోమవారం ఉదయం 8గంటలకు కూల్చివేత ప్రక్రియ మొదలుకానుంది. ఏ స్టేషన్‌లోని నాలుగు టవర్లు, మరో అర్ధగంటలో బీ స్టేషన్, ఆ తర్వాత సీ స్టేషన్‌లోని మిగిలిన నాలుగు టవర్లు గంట లేదా గంటన్నర వ్యవధిలోనే కూల్చివేయనున్నారు. జెన్కోకు సంబంధించిన ఎస్పీఎఫ్ సిబ్బంది, ఉన్నతాధికారుల పర్యవేక్షణతోపాటు ఆ పరిసరాలకు ఎవరు పోకుండా కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నారు.