World Sight day | కళ్లు మన ముఖానికి ఆభరణాలు. అవి ఎంత అందంగా, మరెంత ఆరోగ్యంగా ఉంటాయో మనమూ అంతే అందంగా, ఆరోగ్యంగా కనిపిస్తాం. నేడు ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా కళ్లను ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలనే అంశంపై ప్రత్యేక కథనం.
‘సర్వేంద్రియానాం.. నయనం ప్రధానం..’ అన్నారు పెద్దలు. కళ్లు మనకు దేవుడు ఇచ్చిన అపురూపమైన వరం. వాటిని జాగ్రత్తగా కాపాడుకోవడం మన విధి. మనం ఏ వస్తువును చూడాలన్నా, కళ్లు చాలా అవసరమని తెలిసినా చాలామంది కళ్ల విషయంలో అజాగ్రత్తగా ఉంటారు. కంటి నుంచి నీరుకారినప్పుడో, తలనొప్పిగా ఉన్నప్పుడో మామూలు అద్దాల దుకాణానికి వెళ్లి పరీక్షలు చేయించుకోకుండానే కంటి అద్దాలు తీసుకుంటారు. కానీ కళ్లను మనం జాగ్రత్తగా చూడకపోతే భవిష్యత్‌లో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇందుకోసం అవగాహన కల్పించేందుకు ఏటా అక్టోబర్ 2వ గురువారం నాడు ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అంధత్వ సమస్యలపై ప్రజలను జాగృతం చేసి వీలున్నంతమందికి మెరుగైన కంటిచూపును అందించడమే ఈ ప్రపంచ దృష్టి దినోత్సవం ప్రత్యేకత. ప్రజలకు కంటి సమస్యను దూరం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కంటివెలుగు పథకాన్ని ప్రారంభించిన విషయం విదితమే.
కంటి చూపును మంచిగా ఉంచే ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలి. ‘ఏ’ విటమిన్‌తోపాటు బీటారే రొటీన్ అధికంగా లభించే క్యారెట్ నిత్యం ఆహారంలో ఉండేలా చూడాలి. గుడ్లు, బీన్స్, నారింజ పండ్లు, బొప్పాయి, బాదం ఎక్కువగా తినాలి. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సాయపడే ఒమేగా-3 ప్యాటీ యాసిడ్స్ లభించే చేపలను ఎక్కువగా తినాలి. కళ్లు ఆరోగ్యంలో ఉంచడంలో నట్స్ కీలకపాత్ర పోషిస్తాయి. వాల్నట్స్, బాదం, పిస్తా వంటి నట్స్‌లో ఒమేగా-3 ప్యాట్ యాసిడ్లు, విటమిన్ ఈ ఉంటాయి. ఇవి మీ కంటి ఆరోగ్యాన్ని పెంచుతాయి. ఆకుకూరలు తినడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. బచ్చలి, తోటకూర వంటి ఆకుకూరల్లో ‘సీ’ విటమిన్ అధికంగా ఉండి కళ్లను కాపాడతాయి. సిగరెట్ స్మోకింగ్ వల్ల కంటి శుక్లాలు, కంటి నరాలు దెబ్బతిని దృష్టి సంబంధ సమస్యలు వస్తాయి. అందుకోసం వెంటనే పొగతాగడం మానేయాలి. సూర్యకిరణాల్లో హానికారక అల్ట్రావైలెట్ కిరణాలు కంటిని గాయపరుస్తాయి. అందుకని బయటకు వెళ్లాల్సిన సమయంలో సన్‌గ్లాసెస్ ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి. కంప్యూటర్ ముందు కూర్చుని ఎక్కువ సమయం గడిపేవారి కళ్లు పొడిబారుతుంటాయి.
దీనినుంచి బయటపడటానికి ఎక్కువసార్లు కళ్లు మినకరించేలా చూడాలి. టీవీ చూసేటప్పుడు, కంప్యూటర్‌పై పనిచేసేటప్పుడు యాంటీ గ్లేర్ గ్లాసెస్లను ధరించడం వల్ల కళ్లపై భారం పడకుండా ఉంటుంది. కూల్ గ్లాసెస్ వాడేటప్పుడు అవి యూవీరేస్ నుంచి కాపాడేలా ఉండేలా చూసుకోవాలి. కంట్లో నలుసు పడినప్పుడు చేత్తో నలపడం, రుద్దడం చేయకూడదు. చేతికి ఉన్న మట్టి, దూళీ, సూక్ష్మక్రిములు కంట్లో చేరి అలర్జీ, ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి. వంట చేసేటప్పుడు, వేడి ఆవిరి కళ్లకు తగిలినప్పుడు లేదా కూరగాయలు శుభ్రం చేసే సమయంలో దుమ్ముపడితే వెంటనే చేతులు శుభ్రం చేసుకుని మంచినీటిని కళ్లపై చిలకరించి మెత్తని గుడ్డతో తుడుచుకోవాలి. ఎక్కువ సమయం టీవీలు, కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల ముందు కూర్చోకుండా చూసుకోవాలి. తప్పనసరి అయితే ప్రతీ అరగంటకు ఒకసారి కళ్లను పక్కకు తిప్పుకోవాలి. ప్రతిరోజూ 20 నిమిషాలకు ఒకసారి 20 అడుగుల దూరంలో వస్తువులను చూడాలి. అలా చేయడం వల్ల కంటికి వ్యాయామం లభించి కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
కళ్లను దానం చేయడం వల్ల పెద్దసంఖ్యలో ప్రజలు లబ్ధిపొందుతారు. మరొకరికి కొత్త జీవితం ప్రసాదించినట్లే అవుతుంది. మధుమేహం ఉన్న వారు ప్రతి ఆరునెలలకు ఒకసారి తప్పనిసరిగా కంటి పరీక్షలను చేయించుకోవాలి. రక్తంలో చక్కెరస్థాయి అధికంగా ఉన్నప్పుడు కంటి వెనుక ఉన్న రెటీనా దెబ్బతినే ప్రమాదం ఉంది. కాలక్రమేణా అధిక షుగర్ వల్ల రెటీనాను పోషించే చిన్న రక్తనాళాలు అడ్డుపడడానికి దారితీసి రక్తసరఫరాను నిలిచిపోయే ప్రమాదం ఉంది. దీంతో కంటిచూపు మందగిస్తుంది. అందుకు డయాబెటిస్ రోగులు తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకుని వైద్యుల సలహాలు పాటించాలి.