భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): విడతల వారీగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు గురువారం యథావిధిగా షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు. భద్రాద్రి జిల్లాలో మొదటి విడత 11 మండలాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు నామినేషన్లు స్వీకరించనున్నారు. గురువారం ఉదయం 10:30 నిమిషాలకు ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరణ చేపట్టనుండగా.. ఆయా మండలాలకు ఎన్నికల అధికారులు ఇప్పటికే చేరుకున్నారు.
షెడ్యూల్ ప్రకారం జిల్లాలో మొదటి విడతలో 11 మండలాలు.. భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, ఆళ్లపల్లి, అశ్వాపురం, బూర్గంపాడు, గుండాల, కరకగూడెం, మణుగూరు, పినపాక, జూలూరుపాడు మండలాల్లో 11 జడ్పీటీసీలు, 113 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇందుకోసం 602 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మండల పరిషత్ కార్యాలయాల్లో జడ్పీటీసీలకు ఒక కౌంటర్, ఎంపీటీసీలకు ఒక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు.
భద్రాచలంలో 14 ఎంపీటీసీలు, చర్ల 12, దుమ్ముగూడెం 13, ఆళ్లపల్లి 5, అశ్వాపురం 12, బూర్గంపాడు 17, గుండాల 5, కరకగూడెం 5, మణుగూరు 11, పినపాక 9, జూలూరుపాడులో 10 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. కాగా.. ప్రతి జడ్పీటీసీకి ఒక ఆర్వో, ఏఆర్వో, సిబ్బంది ఉండనున్నారు. ఎంపీటీసీల నామినేషన్ల స్వీకరణకు కూడా మరో ఆర్వో, ఏఆర్వోలను నియమించారు. ఇప్పటికే ఆయా మండలాలకు ఎన్నికల అధికారులు చేరుకున్నారు. మొదటి విడతలో మూడు నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు నిర్వహించేందుకు కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. అయితే ఎన్నికల సంఘం గురువారం అధికారికంగా షెడ్యూల్ ప్రకటించనున్నది.
బీసీ రిజర్వేషన్ల పిటిషన్‌పై కోర్టులో తీర్పు పెండింగ్ ఉండడంతో ఆయా మండలాల్లో ఆశావహులు నామినేషన్లు వెయ్యాలా? వద్దా? అనే మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. కోర్టు తీర్పు అనుకూలంగా వస్తుందా? లేదా వ్యతిరేకంగా వస్తుందా? అనే టెన్షన్ వారిలో మరింతగా పెరిగింది. ఏదేమైనా గురువారం వచ్చే కోర్టు తీర్పునుబట్టి బీసీ నాయకులు నామినేన్లు వేసే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ముందుగా ఎలాంటి ఇబ్బందిలేని ఎస్టీ, ఎస్సీ, జనరల్ స్థానాల్లో నామినేషన్లు వేయనున్నట్లు సమాచారం.