ఖమ్మం, ఆగస్టు 25 : హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణమాసం కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను జరుపుకుంటారు. ప్రతి ఇంట్లో పిల్లలను బాలకృష్ణుడిలా అలంకరించి సంబురాల్లో మునిగిపోతారు. శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. తమ జీవితాల్లో కష్టాలు తొలిగి సుఖసంతోషాలు నిండాలని కోరుకుంటారు.
శ్రీ మహావిష్ణువు 8వ అవతారం శ్రీకృష్ణ భగవానుడు. రాక్షసుడైన కంసుడి చెల్లెలు దేవకి. ఆమెకు వసుదేవుడితో వివాహం జరిపించి అత్తారింటికి పంపే సమయంలో ఆకాశవాణి ప్రత్యక్షమై తన చెల్లెలి కడుపులో 8వ సంతానంగా పుట్టే కుమారుడు కంసుడిని అంతమొందిస్తాడని చెబుతుంది. దీంతో ఆగ్రహానికి గురైన కంసుడు తన చెల్లెలు దేవకి, బావ వసుదేవుడిని కర్మాగారంలో బంధిస్తాడు.
వారికి పుట్టినబిడ్డలను పురిట్లోనే చంపేస్తూ ఉంటాడు. ఎనిమిదో సంతానంగా శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు వసుదేవుడు ఆ గోపాలుడిని బృందావనం తీసుకెళ్లి నందుడు-యశోద దంపతులకు ఇస్తాడు. తిరిగి మధుర వచ్చి తమకు ఎనిమిదో సంతానంగా ఆడపిల్ల పుట్టిందని ఆమెను చంపవద్దని కోరుతాడు. కానీ కంసుడు ఒప్పుకోడు. ఆడపిల్లను చంపేందుకు యత్నిస్తాడు. దాంతో ఆ పాప దుర్గాదేవి అవతారంలో కనిపించి నీ పని అయిపోయినట్టే అని హెచ్చరిస్తుంది. కొన్నేళ్ల తర్వాత కృష్ణుడు పెద్దవాడై మధురకు వచ్చి కంసుడిని చంపుతాడు. దాంతో మధుర ప్రజలకు స్వేచ్ఛ లభిస్తుంది.
శ్రీకృష్ణాష్టమి రోజున ఏ ప్రసాదం చేసినా అందులో తులసి దళాన్ని తప్పనిసరిగా సమర్పించాలి. తులసి శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరమైనది. తులసిదళాన్ని సమర్పించడం వల్ల కన్నయ్య అనుగ్రహం సులభంగా దొరుకుతుంది. ఈ పండుగ పూట శ్రీకృష్ణుడికి, బలరాముడికి రాఖీ కట్టాలి. కన్నయ్యకు ఇష్టమైన మల్లెపూలు, పారిజాతం లేదా దేవగాని పూలను సమర్పించాలి. కృష్ణాష్టమి నాడు ఉపవాస దీక్ష చేసే భక్తులు ఉదయం వేళ పూజలు చేస్తారు. పంచామృతాలతో శ్రీకృష్ణుడి ప్రతిమను శుభ్రం చేస్తారు. కొత్త బట్టలు, నగలు, పూలు, పండ్లతో అలంకరిస్తారు. నైవేద్యంగా మిఠాయి పెడతారు. ఉయ్యాలలో ఉంచి స్వామిని పూజిస్తారు.
కృష్ణాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉట్టి కొట్టే కార్యక్రమాలు నిర్వహిస్తారు. శ్రీకృష్ణుడికి ప్రీతిపాత్రమైన తెల్లటి వెన్న, పెరుగు, పాలను కుండలో ఉంచి దానికి తాడు కట్టి పెద్ద కర్రకు కడుతారు. దానిని ఎవరు కొట్టాలో పోటీ పడతారు.
శ్రీకృష్ణష్టామిని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా శ్రీకృష్ణుడి ఆలయాలు అందంగా ముస్తాబయ్యాయి. భక్తులు ఆలయాలకు నూతనంగా రంగులు వేయడంతోపాటు విద్యుద్ధీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. శ్రీకృష్ణష్టామిని ఘనంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
శ్రీకృష్ణ జన్మాష్టమిని పురసరించుకొని జిల్లా ప్రజలకు బీఆర్ఎస్ నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు శుభాకాంక్షలు తెలిపారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం భువిపై శ్రీకృష్ణ భగవానుడు అవతరించిన పర్వదినం శ్రీకృష్ణ జన్మాష్టమి అని ఆయన పేరొన్నారు. ఈ పవిత్రరోజున యువతి యువకులు ఉట్ల పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.