భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : గూడెం అంటేనే అది ఆదివాసీలు నివసించేది. గిరిజన సంస్కృతి ఉట్టిపడే ఆదివాసీ పల్లెల్లో గిరిజనుల ఇళ్లు, వారి కట్టుబాట్లు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యమనిస్తుంది. పుట్టింది.. పెరిగింది గూడేల్లోనే అయినా అడవి తల్లిని నమ్ముకుని ప్రకృతి సంపదను ఉపాధిగా మలుచుకుని బతుకుతున్న ఆదివాసీ బిడ్డలకూ ఓ రోజు ఉంది.. అదే అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం. అటు అటవీ శాఖ ఆటుపోట్లు, ఇటు అభివృద్ధి పేరుతో గుడిసెలను కూలుస్తున్నా అడవి నుంచి బయటకు రాకుండా అక్కడేపడి జీవిస్తున్న ఆదివాసీల గురించి ఎంతచెప్పినా తక్కువే. వారికి సమాజంలో ఒక ప్రత్యేకత ఉంది. ఆచారాలు, అలవాట్లు, పెళ్లిళ్లు, పండుగలు అన్నీ ప్రత్యేకమే.
1982, ఆగస్టు 9వ తేదీన జెనీవాలో అటవీ వనరుల హక్కులకు సంబంధించిన సమస్యలపై 26 మంది స్వతంత్ర మానవ హక్కుల మేథావులతో వర్కింగ్ గ్రూపుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 140 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆదివాసీల కోసం ఒకరోజు ఉండాలని ఐక్యరాజ్య సమితిని కమిటీ కోరగా, ఆదివాసుల సంరక్షణ చట్టాలకు ఐక్యరాజ్య సమితి ఆమోదం తెలిపింది. ఈ కమిటీ 1992 నుంచి పది సంవత్సరాలపాటు ప్రపంచవ్యాప్తంగా తిరిగి ఆదివాసీల సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి విశ్లేషించి 1994 నుంచి 2014 వరకు ఆ మధ్య కాలాన్ని ఆదివాసీల అభివృద్ధికాలంగా పరిగణించి ఆగస్టు 9వ తేదీని ‘అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం’గా ప్రకటించింది.
దుర్భర జీవితం గడుపుతున్న ఆదివాసీల జీవితాల్లో తెలంగాణ రాష్ట్రం వచ్చాక వెలుగులు నిండాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐటీడీఏ ఉన్నా వారికి రావాల్సిన నిధులు పక్కదారి పట్టడంతో ఆదివాసీలు గూడేలకే పరిమితమయ్యారు. వచ్చే రుణాలు సక్రమంగా వారికి చేరక అభివృద్ధి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. తెలంగాణ వచ్చాక ఆదివాసీ పల్లెలు పట్నాలకు దగ్గరయ్యాయి. మారుమూల గ్రామపంచాయతీల ద్వారా అభివృద్ధిని గిరిజన గ్రామాలకు చేర్చడంతో ప్రతి గ్రామం ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దబడింది. ఈరోజు దేశంలో ఆదర్శ గ్రామ పంచాయతీలు ఉన్నాయంటే అవి గిరిజన పంచాయతీలే అని చెప్పుకోవచ్చు. నాడు గుడిసెలుగా ఉన్న గ్రామాల్లో నేడు పక్కా ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. అంటే గిరిజనులు ప్రభుత్వ పథకాల వల్ల ఆర్థికంగా ఎదిగారు అని చెప్పొచ్చు.
ట్రైకార్ రుణాలు, గిరివికాస్ ద్వారా పంట పొలాల వద్ద మోటర్లు, సబ్సిడీ రుణాలు, ఐటీడీఏ పరిధిలో ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు, గురుకులాల్లో ఉద్యోగాలు ఒకటి కాదు రెండు కాదు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడంతోపాటు సాగుకు రైతుబంధు ఇచ్చి వ్యవసాయపరంగా ప్రోత్సహించడంతో గిరిజన ప్రాంతంలో ఆదివాసీలు అభివృద్ధిలో పోటీపడే స్థాయికి వచ్చేశారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి గూడేనికి నల్లా ఇచ్చి తాగునీటి సమస్యకు పరిష్కారం చూపారు. గొత్తికోయల గ్రామాల్లో సోలార్ ద్వారా తాగునీరు ఇచ్చి గిరిజన కుటుంబాలను ఆదుకున్నారు.
ఎన్నో ఏళ్లుగా అడవిలో పోడుకొట్టి సాగు చేసుకుంటున్న ఆదివాసీలకు గత కేసీఆర్ ప్రభుత్వం పోడు పట్టాలు ఇచ్చి వారికి సముచిత స్థానాన్ని కల్పించింది. జిల్లాలో 51 వేల మంది రైతులకు పోడు పట్టాలు ఇచ్చి వారికి రైతుబంధు కూడా ఇచ్చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా భద్రాద్రి జిల్లాలోనే 1,51,195 ఎకరాలకు గాను.. 50,595 మంది రైతులకు పోడు పట్టాలు ఇచ్చారు.