ఖమ్మం, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల మంజూరు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతుందనే విషయం స్పష్టమవుతున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సమ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండగా.. ముగ్గురు మంత్రులున్న ఖమ్మం జిల్లాకు.. అదీ పక్క పక్కనే ఉన్న సొంత నియోజకవర్గాలకే మూడు స్కూళ్లను మంజూరు చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడేందుకు పాఠశాలలు దోహదం చేస్తాయని ప్రభుత్వం చెబుతున్నా.. ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నది. ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఖమ్మం, మధిర, పాలేరుల్లో ఇంటిగ్రేడెట్ స్కూల్స్ ప్రారంభిస్తుండగా, భద్రాద్రి జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు ఒక్క పాఠశాలను కూడా మంజూరు చేయలేదు. ఏజెన్సీ ప్రాంతాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదంటే వారికి ఆదివాసీలు, గిరిజనులపై ఎంత ప్రేమ ఉందో ఇట్టే అర్థమవుతున్నది.
అన్ని కులాలు, మతాల విద్యార్థులు ఒకే ప్రాంగణంలలో చదవడం వల్ల వారి మధ్య స్నేహభావంతోపాటు విలువలతో కూడిన సమాజం ఏర్పడుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు వారికి కేటాయించిన పద్ధతుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.
6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వీటిలోనే విద్య అందించేలా ప్రణాళికలు రూపొందించారు. పాఠశాల ఏర్పాటుకు కనీసం 20 నుంచి 25 ఎకరాల స్థలం ఉండేలా చర్యలు చేపట్టారు. ప్రత్యేకంగా అడ్మినిస్ట్రేషన్ భవనం కోసం ఒక బ్లాక్, తరగతి గదుల కోసం మరో బ్లాక్, వసతి సదుపాయం కోసం ఇంకో బ్లాక్ ఏర్పాటు చేస్తున్నారు. క్యాంపస్‌లో టాయిలెట్ల కోసం ప్రత్యేకంగా వేరొక బ్లాక్ నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. కంప్యూటర్ ఎడ్యుకేషన్, ల్యాబొరేటరీ, క్రీడల కోసం ప్రత్యేకంగా కోర్టులు, ఉపాధ్యాయులకు క్వార్టర్లు నిర్మించనున్నారు.
ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలం జింకలతండా, పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్, మధిర నియోజకవర్గంలోని బోనకల్ మండలం లక్ష్మీపురంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. శుక్రవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ఈ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. డీఈవో సోమశేఖరశర్మ ఆధ్వర్యంలో సెక్టోరల్ అధికారులు, ఎంఈవోలు శంకుస్థాపన కార్యక్రమంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా సర్వం సిద్ధం చేశారు.
ఖమ్మం జిల్లాలో మంత్రులున్న నియోజకవర్గాల్లో మాత్రమే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను మంజూరు చేయించుకున్నారు. భద్రాద్రి జిల్లాలో కనీసం ఒక్క స్కూల్‌ను కూడా తొలి విడతలో మంజూరు చేయలేదు. విద్యాభివృద్ధి విషయంలో ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి జిల్లాకు ఖమ్మం జిల్లాతోపాటు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండగా.. ప్రభుత్వం ఆ అంశాన్ని పూర్తిగా విస్మరించింది. దీంతో భద్రాద్రి జిల్లావాసులు మంత్రుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ జిల్లాకు కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను మంజూరు చేయాలనే డిమాండ్ అక్కడి ప్రజాప్రతినిధుల నుంచి వినిపిస్తున్నది.
ఇంటిగ్రేడెట్ స్కూళ్ల శంకుస్థాపన కార్యక్రమాలకు పాఠశాల విద్యార్థులను తరలించేందుకు విద్యాశాఖ సిద్ధమవుతున్నది. ప్రస్తుతం దసరా సెలవులు ఉన్నప్పటికీ విద్యార్థులను యూనిఫాంలో శంకుస్థాపన ప్రదేశాలకు తీసుకురావాలని అధికారులు విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టనున్నారు.
2025-26 విద్యాసంవత్సరంలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ తరగతుల్లో 2,600 మంది విద్యార్థులు చదువుకునేలా, వీరికి బోధించేందుకు 120 మంది ఉపాధ్యాయులను నియమించనున్నారు. వీరికి ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఉండేందుకు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇంజినీరింగ్ అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు విద్యాశాఖాధికారులు పేర్కొంటున్నారు. ప్రపంచ స్థాయిలో పోటీపడే విధంగా టీచర్ పీపుల్ రేషియో కూడా 1:20 మాత్రమే ఉండి.. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపాధ్యాయులు అందుబాటులో ఉండే విధానం అమలు చేయనున్నారు.