భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను తొలుత భద్రాద్రి జిల్లాకు ఇవ్వకుండా ఇతర జిల్లాలకు తీసుకెళ్తుండడంపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, జిల్లా రైతులు భగ్గుమంటున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు కలిసి గోదావరి జలాలను వారి ప్రాంతాలకు తీసుకెళ్తూ భద్రాద్రి జిల్లా రైతులకు అన్యాయం చేస్తుండడంపై మండిపడుతున్నారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాన్ని కాలరాస్తూ.. ప్రాజెక్టుకు, కాలువలకు భూములిచ్చిన ఇక్కడి రైతులను గోసపెడుతూ గోదావరి నీటిని సాగర్ ఆయకట్టుకు అనుసంధానం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు.
భూములిచ్చిన భద్రాద్రి రైతులకు నీళ్లు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలంలోని పూసుగూడెం పంపుహౌస్ శిలాఫలకం వద్ద సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి పిండప్రదానం చేసి నిరసన తెలిపే కార్యక్రమాన్ని సోమవారం చేపట్టనున్నారు. ఇందుకోసం భద్రాద్రి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు సోమవారం పూసుగూడెం వద్దకు చేరుకోనున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందుచూపుతో నిర్మించిన సీతారామ ప్రాజెక్టు ఫలాలను భద్రాద్రి జిల్లా రైతులకు అందకుండా చేస్తోంది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం. తోటి రైతులకు సాగునీళ్లు అందించడం కోసం తమ భూములను పణంగా పెట్టిన రైతులకు చుక్కనీరు అందకుండా చేస్తోంది రేవంత్ సర్కారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పాన్ని నీరుగారుస్తున్న ప్రస్తుత కాంగ్రెస్ పాలకులపై బీఆర్ఎస్ జిల్లా నేతలు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఇచ్చిన పిలుపు మేరకు పూసుగూడేనికి పెద్ద సంఖ్యలో పయనమవుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి అక్కడ చేపట్టనున్న పిండప్రదానం నిరసనలో పాల్గొననున్నారు. భద్రాద్రి జిల్లా రైతులకు ప్రస్తుత పాలకులు చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి సహా భద్రాద్రి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు హాజరుకానున్నారు.
ఉమ్మడి జిల్లాలోని బీడు భూములకూ గోదావరి నీళ్లకు అందించాలన్న సంకల్పంతో రూ.18 వేల కోట్లతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాడు 90 శాతం వరకూ నిర్మించిన సీతారామ ప్రాజెక్టును ఇక్కడి రైతులందరూ తమ వరప్రదాయినిగా భావించారు. ప్రాజెక్టు నీళ్లు తమ పొలాలకు ఎప్పుడు చేరుకుంటాయోననుకుంటూ ఎదురుచూస్తూ ఉన్నా రు. కానీ ఇంతలో అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. భూములిచ్చిన భద్రాద్రి జిల్లా రైతులను నిలువునా ముంచేందుకు పూనుకుంది. కేవలం రూ.70 కోట్లు వెచ్చించి ‘రాజీవ్’ పేరిట లింక్ కెనాల్ నిర్మించింది.
తొలుత భద్రాద్రి జిల్లాలో పారాల్సిన నీటిని ఖమ్మం జిల్లాకు తరలించింది. అక్కడి నుంచి సాగర్ కాలువకు నీటిని మళ్లించి వాటిని ఆంధ్రాలోని ఆయకట్టుకూ పంపించి భద్రాద్రి రైతులకు కన్నీళ్లు మిగిల్చింది. దీనిపై ఆగ్రహించిన భద్రాద్రి జిల్లా రైతులు ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలుపెట్టారు. వారికి బీఆర్ఎస్ కూడా బాసటగా నిలిచింది. ఈ మేరకు సోమవారం పూసుగూడెం వద్ద నిరసన చేపట్టనుంది. 2024 ఆగస్టు 15న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు ప్రారంభించిన పంపుహౌస్‌ల వద్దనే ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనుంది.
ఎంతో ముందుచూపున్న మా నేత కేసీఆర్ సీతారామ ప్రాజెక్టును నిర్మించి భద్రాద్రి జిల్లాకు వరంగా ఇచ్చారు. ఉమ్మడి జిల్లాకు ఉపయోగకరంగా ఉండేందుకు ఈ ప్రాజెక్టు నిర్మించారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మొదటగా భద్రాద్రి జిల్లాకు నీళ్లు ఇవ్వకుండా ఖమ్మం జిల్లాకు తీసుకెళ్తోంది. పైగా, రాజీవ్ కెనాల్ కాలువను నిర్మించి.. సీతారామ జలాలను తీసుకెళ్లి సాగర్ కాలువలో కలిపి ఇటు ఖమ్మానికి, అటు ఆంధ్రాకు తరలిస్తోంది. భద్రాద్రి జిల్లాకు నీళ్లు ఇచ్చే వరకూ పోరాటం చేస్తాం.
-రేగా కాంతారావు, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు
సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ముందుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులకే ఇవ్వాలి. ఆ తరువాతే ఇతర జిల్లాలకు తీసుకెళ్లాలి. కానీ తొలుత భద్రాద్రి జిల్లా రైతులకు ఇవ్వకుండా వేరే జిల్లాలకు తీసుకెళ్తే ఊరుకోం. భద్రాద్రి జిల్లాలో నిర్మించిన సీతారామ ప్రాజెక్టు ఫలాలను ముందుగా ఇక్కడి రైతులకే అందించాలి. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఇతర జిల్లాలకు తరలిస్తూ సొంత జిల్లా రైతులకు అన్యాయం చేస్తుంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధిచెబుతాం.
-వనమా వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి