కారేపల్లి, డిసెంబర్ 12 : మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 17వ తేదీన జరిగే 35 పంచాయతీ సర్పంచుల ఎన్నికల్లో కారేపల్లి మండల వ్యాప్తంగా 19 గ్రామ పంచాయతీల్లో త్రిముఖ పోటీ అనివార్యమైంది. సింగరేణి మండలంలో 41 గ్రామ పంచాయతీల్లో ఆరు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా ఎన్నికలు జరిగే గ్రామాల్లో అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. మండల కేంద్రమైన కారేపల్లి, భాగ్యనగర్ తండా గ్రామ పంచాయతీలలో 8 మంది అభ్యర్థులు సర్పంచ్ పోటీలో నిలిచారు. 10 గ్రామ పంచాయతీల్లో ముఖాముఖి పోటీ నెలకొంది. రెండు పంచాయతీల్లో నలుగురు అభ్యర్థులు పోటీలో ఉండగా ఒక పంచాయతీలో 5గురు అభ్యర్థులు, చిన్న గ్రామ పంచాయతీ అయిన మంగలితండాలో ఏడుగురు అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.
పలు గ్రామాల్లో సాధ్యం కాని హామీలు ఇస్తూ అభ్యర్థులు పోటాపోటీగా ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఖర్చు చేయడంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. వ్యవసాయ పనుల సీజన్ కావడంతో పొద్దంతా రైతులు, మహిళలు ఇళ్లల్లో ఉండడం లేదు. వ్యవసాయ కూలీలు వరి నాట్లు వేసేందుకు, పత్తి ఏరేందుకు వెళ్తున్నారు. దీంతో అభ్యర్థులు తెల్లవారుజాము ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఊర్లలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు.