ఖమ్మం, సెప్టెంబర్ 3 : మున్నేరుకు ముంపు వచ్చి మూడ్రోజులవుతున్నా ఆ మురుగును తొలగించే నాధుడే కరువయ్యాడు. వరద కారణంగా సర్వసం కోల్పోయి కట్టుబట్టలతో ఉన్న బాధితులకు తినడానికి తిండి, తాగడానికి నీళ్లు ఇచ్చేవారు కూడా లేరు… కేవలం అధికారులు, కాంగ్రెస్ నాయకులు నామమాత్రంగా రోడ్లపైన అక్కడ అక్కడ కనిపిస్తున్నారే తప్ప క్షేత్రస్థాయిలో బాధితుల వద్దకు వెళ్లివారికి కావాల్సిన కనీస అవసరాలను తీర్చలేకపోతున్నారు.
మూడ్రోజుల క్రితం మున్నేరు నదికి గతంలో ఎన్నడూ లేనివిధంగా వరద వచ్చి వేలాది మంది నిరాశ్రయులుగా మారిన సంగతి తెలిసిందే. ఖమ్మం నగరంలోని మున్నేరు శివారు ప్రాంతాలైన బొక్కలగడ్డ, మంచికంటినగర్, వెంకటేశ్వరనగర్, మాణిక్యనగర్, మోతీనగర్, గణేష్‌నగర్, ధ్వంసలాపురం తదితర ప్రాంతాల్లో వరద కారణంగా ఇండ్లు మొత్తం బురదమయంగా మారాయి.
నీటి ప్రవాహం తగ్గినప్పటికీ ఇండ్లు మొత్తం రెండుమీటర్ల ఎత్తు బురదలోనే ఉన్నవి.. కట్టుబట్టలతో ప్రాణాలను రక్షించుకున్నప్పటికీ వారికి తినడానికి తిండి లేదు, విద్యుత్ సౌకర్యం లేదు, వండు కోవడానికి సరుకులు లేవు.. ఇంతటి దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్న ముంపు బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కనీస సౌకర్యాలు లేవు..
ఇండ్లలో చేరిన బురద, వంట సామగ్రి, ఇతర వస్తువులకు పట్టిన బురదను శుభ్రం చేయడానికి కనీసం నీళ్లు కూడా సరఫరా చేయడం లేదు. నామమాత్రంగా కార్పొరేషన్ అధికారులు నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేసి నీటి సరఫరా చేస్తున్నప్పటికీ ప్రజలకు సరిపడా అందుబాటులో లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. మెయిన్ వీధుల్లో మాత్రమే నీటి సరఫరా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
చిమ్మచీకట్లోనే ముంపు ప్రాంతాలు..
మున్నేరు నదికి వరద వచ్చిన రోజు నుంచి ప్రజలు చిమ్మచీకట్లోనే గడుపుతున్నారు. విద్యుత్ స్తంభాలు విరిగి, తీగలు తెగి భూమిమీదనే వేలాడుతున్నవి. వరద తగ్గి, వర్షం కూడా లేనప్పటికీ ఇంతవరకు వాటిని తొలగించి, విద్యుత్‌ను పునరుద్ధరించలేదు. చీకట్లో పాములు, తేళ్లు ఇండ్లలోకి వచ్చే ప్రమాదం ఉందని ప్రజలు భయంతో వణిపోతున్నారు.
బ్లీచింగ్ చల్లలేదు.. మాత్రలు ఇవ్వలేదు..
బురదను క్లీన్ చేయకపోవడం వల్ల మున్నేరు ముంపు ప్రాంతం మొత్తం దుర్గంధం వెదజల్లుతోంది. తడిసిన బియ్యం వాసన వస్తున్నాయి, మున్సిపల్ సిబ్బంది ట్రాక్టర్లను ఏర్పాటు చేయకపోవడం వల్ల బియ్యంను రోడ్లమీదనే పోయడంతో వాసన వస్తున్నాయి. కనీసం బ్లీచింగ్ కూడా చల్లడం లేదు. ఎక్కడా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయకపోగా కనీసం మాత్రలు కూడా ఇవ్వడం లేదు.
మునిగిన లారీలు.. కార్లు
మున్నేరు వరద కారణంగా లారీల కార్యాలయ ఆవరణంలో గల సుమారు 200 లారీలు మునిగిపోయాయి. అవన్నీ మంగళవారం రోడ్డు మీద పడి ఉన్నవి. వీటి మరమ్మతులకు ఒక్కొక్క లారీకి సుమారు రూ.లక్ష ఖర్చు అవుతుందని లారీ యజమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కార్లు కూడా ఇదే పరిస్థితి. ద్విచక్ర వాహనాలు స్టార్ట్ కాక ఇబ్బందులు పడుతున్నారు.
ఎందుకొచ్చారో తెలవడం లేదు..
సీఎం రేవంత్‌రెడ్డి మా ఇంట్లోకి వచ్చినా నన్ను కలవనీయలేదు. ఒకవైపు పోలీసులు, మరోవైపు నాయకులు ఉన్నారు. కనీసం మాట కూడా నన్ను పిలిచి మాట్లాడలేదు. సరే.. ఏమైనా సాయం చేస్తారేమో అనుకున్నా అది కూడా లేదు. మా కాలనీకి ముఖ్యమంత్రి ఎందుకు వచ్చారో.. ఎందుకు వెళ్లారో తెలవడం లేదు.
-మూతి సంతోశ్, రాజీవ్ గృహకల్ప, ఖమ్మం రూరల్
రెండు రోజుల నుంచి ఇవే బట్టలతో..
పావు గంటలోనే వరద నీరు ఇంటిని చుట్టుముట్టింది. ఏడుస్తూ ఉన్న ఫలంగా కట్టుబట్టలతో ఇంటిని వదిలి బయటకు వచ్చాం. వరద తగ్గిన తర్వాత ఇంటికెళ్లి చూస్తే గుండె ఆగిపోయినంత పనైంది. నిన్నటి నుంచి అవే బట్టలతో ఉంటున్నా. చేతిలో చల్లిగవ్వ లేదు. ఆపదొస్తే ప్రభుత్వం ఉందని అనుడే తప్ప ఎవరూ పట్టించుకోట్లే.
-పద్మ, నాయుడుపేట, ఖమ్మం రూరల్
రెండు రోజుల నుంచి పస్తులే..
రెండు రోజుల నుంచి పస్తులున్నాం. ఇంటి మందు ఉన్న బురద నీళ్లతోనే కాళ్లు, చేతులు శుభ్రం చేసుకుంటున్నాం. గిన్నెలు, బట్టలు ఇక్కడే శుభ్రం చేసుకుంటున్నాం. ఈరోజు హరీశ్‌రావు, సబితమ్మ నా దగర్గకు వచ్చారు. చేతిలో చెయ్యేసి నీకు సాయం చేపిస్తామని మాటిచ్చారు. కొంత ధైర్యం వచ్చింది. మా కోసం మాట్లాడుతామన్నారు.
-చంద్రమ్మ, రాజీవ్ గృహకల్ప, ఖమ్మం రూరల్
కాంగ్రెస్‌కు ఓటేసి పెద్ద తప్పు చేశాం..
పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి పెద్ద తప్పు చేశాం. ఇప్పుడు మా చెప్పుతో మేమే కొట్టుకుంటున్నాం. ఇంత గోస పెడతారని అనుకోలేదు. మాకు ప్రభుత్వ సాయం ఏమీ వద్దు. కానీ మా కాలనీలో ఎంతో మంది పూటకు లేని వాళ్లు అరిగోస పడుతున్నారు. ప్రభుత్వం వారిని చూడాలి. లేకపోతే పేదవాళ్ల ఉసురు తగులుతుంది.
-ఖాజామియా, రాజీవ్ గృహకల్ప, ఖమ్మం రూరల్
పంచాయతీ సిబ్బంది కూడా రావట్లే..
మా పక్కన ఉన్న రాజీవ్ గృహకల్పకు మంత్రులు, సీఎం, అధికారులు వెళ్తున్నారు. కానీ మా కాలనీకి ఒక్కరు వచ్చిన పాపాన పోలేదు. వరద తగ్గి రెండు రోజులు అవుతుంది. ప్రభుత్వం తరఫున ఒక్కరైనా వచ్చి తిన్నారా.. అని పలకరించలేదు. కనీసం పంచాయతీ సిబ్బంది కూడా రావడం లేదు. కటిక చీకట్లోనే ఉంటున్నాం.
-నందిగామ కిరణ్‌కుమార్, ఫోర్త్‌క్లాస్ ఎంప్లాయీస్ కాలనీ, ఖమ్మం రూరల్
ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు..
నా అరవయ్యేళ్ల జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు. కాలనీలో చిన్న కిరాణం, ఫ్యాన్సీ కొట్టు పెట్టుకున్నా. వరదలతో ఒక్క వస్తువు కూడా మిగల్లేదు. ప్రభుత్వం ఇచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోవు. అధికారులు రాజీవ్ గృహకల్ప భవనాల పరిస్థితిని కూడా అంచనా వేయాలి. అవి ఎప్పుడు కూలుతాయో తెలియదు.
-వీరభద్రం, చిరు వ్యాపారి, రాజీవ్ గృహకల్ప, ఖమ్మం రూరల్
వరద బాధితులకు నేను సైతం..
సీఎం సహాయ నిధికి రూ.3 వేలు అందించిన బాలిక
మహబూబాబాద్ రూరల్: వరద ముంపు బాధితులను ఆదుకోవాలనే ఆలోచనతో తన కిడ్డీ బ్యాంకులో దాచుకున్న రూ.3 వేలను మంగళవారం మహబూబాబాద్ కలెక్టరేట్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులమీదుగా సీఎం సహాయనిధికి అందిస్తున్న పదో తరగతి విద్యార్థిని ముత్యాల సాయిసింధు. ఈ సందర్భంగా సీఎం సహా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, ఎంపీ బలరాంనాయక్.. బాలికను అభినందించారు.