భద్రాచలం, మార్చి 20 : దైవ దర్శనానికి వచ్చిన మిత్రులు స్నానం చేసేందుకు గోదావరి నదిలోకి దిగగా ఐదుగురు గల్లంతయ్యారు. ఇందులో ముగ్గురి మృతిదేహాలు లభ్యంకాగా.. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సరిహద్దు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోలవరం జిల్లా కుక్కునూరు మండలం వేలేరు గ్రామ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది.
కుక్కునూరు గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. ఏపీ రాష్ట్రం అమరావతి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన పాశం సతీశ్‌కుమార్, కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన తేజజ్ఞసాయి, భద్రాచలం పట్టణానికి చెందిన చారుగుళ్ల శ్రీకర్(21), కృష్ణా జిల్లా కలిదిండి గ్రామానికి చెందిన చండూరి దీపక్, విజయనగరానికి చెందిన గడ్డం హర్షవర్దన్, కేఎల్‌యూలో బీటెక్ చదివే కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన దగ్గుపాటి నవదీప్(19), భద్రాచలం పట్టణానికి చెందిన పొడిచేటి అభిరామ్(19)లు స్నేహితులు. వీరంతా గురువారం భద్రాచలం చేరుకొని సీతారామచంద్రస్వామిని దర్శించుకుని, దేవస్థానం కాటేజీలో రాత్రి బస చేశారు. శుక్రవారం ఉదయం ఫొటో షూట్ కోసం భద్రాచలం సమీపంలో ఉన్న కొల్లుగూడెం ఇసుక ర్యాంపు వద్దకు వెళ్లారు. అక్కడ గోదావరిలో నీరు లేకపోవడంతో మూడు కిలోమటర్ల దూరం ఇసుకలో నడుచుకుంటూ నీరు ఎక్కువగా ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు.
ఫొటోలు దిగిన తర్వాత చండూరి దీపక్ మినహా మిగతా ఆరుగురు గోదావరి నదిలో స్నానాలు చేసేందుకు దిగారు. వీరు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని నదిలో నడుస్తుండగా కొంచెం ముందుకెళ్లగా లోతు ఉన్న ప్రాంతంలో తొలుత తేజజ్ఞసాయి గల్లంతయ్యాడు. అతడిని కాపాడే ప్రయత్నంలో చారుగుళ్ల శ్రీకర్, దగ్గుపాటి నవదీప్, పొడిచేటి అభిరామ్, పాశం సతీశ్‌కుమార్, గడ్డం హర్షవర్ధన్‌లు నదిలో గల్లంతయ్యారు. ఈ క్రమంలో హర్షవర్ధన్‌కు ఈత రావడంతో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. మిగిలిన ఐదుగురు గోదావరి నదిలో గల్లంతయ్యారు. ఒడ్డున ఉన్న చండూరి దీపక్ ఒడ్డున ఉండి గట్టిగా కేకలు వేసినా సమీపంలో ఎవరూ లేకపోవడంతో ఐదుగురు యువకులు నదిలో మునిగిపోయారు.
దీంతో హర్షవర్ధన్, దీపక్‌లు జరిగిన ఘటన గురించి నీటిలో గల్లంతైన చారుగుళ్ల శ్రీకర్ తండ్రి రామకృష్ణకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి భద్రాచలం నుంచి పోలీసులు, అగ్నిమాపక శాఖ రెస్క్యూ టీం, గజ ఈతగాళ్లతోపాటు ఏపీలోని యటపాక, కుక్కునూరు పోలీసులు చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన ప్రాంతంలో రెస్క్యూ బృందాలు, గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టగా.. శుక్రవారం సాయంత్రం వరకు భద్రాచలంకు చెందిన శ్రీకర్, పొడిచేటి అభిరామ్, కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన నవదీప్ మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగతా ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
భద్రాచలం అగ్నిమాపక శాఖ ఫైర్‌మెన్ కుమార్, ప్రకాశ్, నవీన్‌లతోపాటు భద్రాచలం ఎస్సైలు సతీశ్, శ్యాంప్రసాద్, యటపాక ఎస్సై, కుక్కునూరు పోలీసులు, గజ ఈతగాడు ప్రసాద్ ఘటనా స్థలంలో గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కాగా, రామయ్య దర్శనానికి వచ్చిన విద్యార్థులు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో వారి కుటుంబాల్లో పెను విషాదం నిండింది. చేతికందిన కొడుకులను విగత జీవులుగా ఒడ్డుకు తీసుకొస్తుండడంతో కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో గోదావరి తీరం మిన్నంటింది. భద్రాచలంకు చెందిన పొడిచేటి అభిరామ్ రామాలయంలో పరిచారకుడిగా పని చేస్తున్నారు. భద్రాచలంకు చెందిన చారుగుళ్ల శ్రీకర్, అభిరామ్‌లు స్నేహితులు కావడంతో ఉదయం అభిరామ్ రామాలయంలో విధులు ముగించుకొని వారితో వెళ్లి మృత్యువాత పడ్డాడు.