కారేపల్లి, అక్టోబర్ 07 : వారసత్వంగా తమకు సంక్రమించిన భూముల్లో సాగు చేయకుండా అడ్డుపడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆదివాసి గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండలం కోమట్లగూడెం గ్రామానికి చెందిన ఈసాల కృష్ణయ్య కుటుంబ సభ్యులు మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తమ గోడును వెలిబుచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా తమ బంధువైన ఈసాల వెంకన్న తమను వ్యవసాయం చేసుకోనివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. రాజకీయంగా, ఆర్థికంగా బలంగా ఉన్న అతడు తమ భూములను బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడన్నారు.
ఈ నెల 2వ తేదీన తమ చేనులో గేదెలను మేపుతుండగా ఈసాల వెంకన్న, అతని కుమారుడు ఉదయ్, చిన్న కుమారుడు కలిసి తమపై (కృష్ణయ్య, కోటమ్మ, రజిత) విచక్షణా రహితంగా దాడి చేశారని విలపించారు. ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈసాల వెంకన్న, అతడి కుమారులతో తమకు ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని కోరుతూ పోలీసులను వేడుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో వారి బంధువులు చిరంజీవి, ఈసాల ఎర్రయ్య, విజయ, బాయమ్మ, ఉమా, రమా పాల్గొన్నారు.