అశ్వారావుపేట, డిసెంబర్ 30: అశ్వారావుపేట మండల పరిషత్ కార్యాలయంలో దొంగలు పడ్డారు. నిరుపేద మైనార్టీ మహిళలకు ఉచితంగా అందించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిపెట్టిన కుట్టు మిషన్లు చోరీకి గురయ్యాయి. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కుట్టు మిషన్లను ఏడాది కాలంగా పంపిణీ చేయకుండా అధికారులు మూలనపడేశారు.
అయితే, కార్యాలయంలో అడ్డుగా ఉన్నాయనే కారణంతో వాటిని వేరే గదిలోకి తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆ మిషన్లు చోరీకి గురైనట్లు అధికారులు గుర్తించారు. అయితే ‘ఇందులో ఇంటి దొంగల ప్రమేయం ఉందా? లేక బయటి వ్యక్తుల పనా?’ అనేది అంతు చిక్కడం లేదంటూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. విషయాన్ని బయటకు పొక్కనీయకుండా గోప్యత పాటించడానికి తర్జనభర్జన పడుతున్నారు. చోరీకి గురైన మిషన్ల విలువ రూ.2.22 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
పేదల సంక్షేమానికి పెద్దపీట వేసిన గత కేసీఆర్ ప్రభుత్వం.. నిరుపేద మైనార్టీ మహిళల కోసం ఉచితంగా అందించడానికి కట్టు మిషన్లు మంజూరు చేసింది.
ఇవి గత ఏడాది జూలై నాటికి జిల్లాలకు చేరాయి. పంపిణీ బాధ్యతను ఎంపీడీవోలకు అప్పగించారు. అశ్వారావుపేట నియోజకవర్గానికి 83 కుట్టు మిషన్లు మంజూరు కాగా అవి స్థానిక మండల పరిషత్ కార్యాలయానికి చేరాయి. ఆ వెంటనే అసెంబ్లీ, తర్వాత పార్లమెంట్ ఎన్నికలు రావడంతో వాటి పంపిణీకి బ్రేక్ పడింది. కుట్టు మిషన్లను అధికారులు మండల పరిషత్ కార్యాలయంలోనే భద్ర పరిచారు. అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కాగానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత మిషన్ల పంపిణీ అటకెక్కింది. దీంతో అవి తుప్పు పట్టే దశకు చేరుతున్నాయి.
ఆ కుట్టు మిషన్లపై అప్పటి సీఎం కేసీఆర్ ఫొటో ఉందన్న కారణంతోనే కాంగ్రెస్ పాలకులు వాటి పంపిణీకి బ్రేక్ వేశారు. అయితే ఒకవేళ వాటిని పంపిణీ చేయాలంటే ఆ మిషన్లపై కేసీఆర్ ఫొటో ఉండకూదని కాంగ్రెస్ పాలకులు భావించారు. ఈ క్రమంలోనే ఆ ఉచిత మిషన్లపై ఉన్న కేసీఆర్ ఫొటోలను తొలిగించినట్లు సమాచారం. ఇంతలో చోరీ ఘటన వెలుగులోకి రావడంతో దీనిని బయటకు పొక్కనీయకుండా గోప్యత కోసం అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు.
నియోజకవర్గ వ్యాప్తంగా పేద మైనార్టీ మహిళలకు ఉచితంగా అందించడానికి గత కేసీఆర్ ప్రభుత్వం 83 కుట్టు మిషన్లు మంజూరు చేసింది. వీటిని నియోజకవర్గ కేంద్రమైన అశ్వారావుపేట మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు భద్రపరిచారు. అశ్వారావుపేటకు 37, దమ్మపేటకు 16, ములకలపల్లికి 13, చండ్రుగొండకు 16, అన్నపురెడ్డిపల్లి మండలానికి ఒకటి చొప్పున కుట్టు మిషన్లు మంజూరయ్యాయి. వీటిలో సుమారు రూ.2.21 లక్షల విలువైన 19 మిషన్లు, 49 మోటార్లు, 14, స్టాండ్లు, 17 టేబుళ్లు మాయమయ్యాయి.
‘నియోజకవర్గానికి మంజూరైన కుట్టు మిషన్ల పంపిణీ జరుగుతుందా?’ అనే అనుమానం వ్యక్తమవుతోంది. ‘చోరీకి గురైన మిషన్లు రికవరీ అయ్యే వరకు వీటి పంపిణీ సాధ్యమా?’ అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ పంపిణీ చేయాల్సి వస్తే చోరీకి గురైన మిషన్లు ఏ మండలానికి తగ్గించాలో కూడా అధికారులకు అంతుబట్టడం లేదు. ఇప్పటికే లబ్ధిదారుల జాబితా కూడా ఉన్నతాధికారుల నుంచి ఎంపీడీవోలకు అందింది. ఆ జాబితా ప్రకారం పంపిణీ చేయడం సాధ్యమయ్యే పనికాదు. ‘మరి అరకొరగా పంపిణీ చేసి చేతులు దులుపుకోవాలంటే మిగతా లబ్ధిదారులకు ఏం సమాధానం చెపుతారు?’ అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇన్ని సమస్యలు ముందున్న ఈ పరిస్థితుల్లో ‘పంపిణీ చేస్తారా? లేక పక్కన పడేస్తారా?’ అనే ప్రశ్న లబ్ధిదారులను వెంటాడుతోంది.
నియోజకవర్గానికి 83 కుట్టు మిషన్లు మంజూరయ్యాయి. వీటిని భద్ర పరిచే క్రమంలో కుట్టు మిషన్ల సంఖ్య తగ్గినట్లు గుర్తించాం. వీటి వివరాలను సేకరిస్తున్నాం. అతి త్వరలోనే లబ్ధిదారులకు పంపిణీ చేస్తాం. ఇందుకు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నాం.
-ప్రవీణ్‌కుమార్, ఎంపీడీవో