ఖమ్మం రూరల్, మే 24: ఉమ్మడి పాలనలో ఆదరణకు నోచుకోని ఆ గ్రామం ఇప్పుడు అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తోంది. వందేళ్లలో జరగాల్సిన అభివృద్ధి కేవలం పదేళ్లలోనే ప్రజల ముందు సాక్షాత్కరిస్తోంది. మున్సిపాలిటీ తరహాలో గ్రామంలో ప్రభుత్వ సేవలు అందుతుండడం ఆ గ్రామానికే సొంతం. కేవలం ఈ గ్రామ అభివృద్ధికి ఇటీవల సీఎం కేసీఆర్ రూ.10 కోట్ల నిధులు ప్రకటించడం ఎంతో ప్రత్యేకం. అన్నింటికీ మించి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులందరూ నగరం నుంచి గ్రామానికి క్యూ కడుతుండడం మరింత విశేషం. అదే.. ఖమ్మం రూరల్ మండలంలోని పెద్దతండా గ్రామం. ఖమ్మం నగరానికి చెంతనే ఉన్న ఈ గ్రామం ఎంతో ప్రత్యేకమైనది. పేరులో ఉన్నట్లుగానే ఒకప్పుడు తండాను తలపించిన ఈ గ్రామం ఇప్పుడు పట్టణానికి దీటుగా అభివృద్ధి చెందింది. తెలంగాణ సిద్ధించి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఈ గ్రామం చూస్తుండగానే అసాధారణ అభివృద్ధిని సాధించింది. జనాభా సంఖ్య, ఓటర్ల సంఖ్య చూస్తుండగానే పెరిగిపోయాయి. అదే క్రమంలో సకల వసతులూ సమకూరాయి. నగరంలో ఉంటున్న ప్రజలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, వ్యాపారులు వందలాదిగా వచ్చి నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. ఒకనాడు అరకొర వసతులతో అల్లాడిన ఇక్కడి ప్రజలకు పట్టణం తరహాలో ప్రభుత్వ సేవలు అందుతున్నాయి. పచ్చదనం, పరిశుభ్రత సహా సకల మౌలిక వసతులూ ఉన్న ఈ గ్రామం సంపూర్ణ అభివృద్ధికి కేంద్ర బిందువుగా ఉంది.
చూడడానికి అది పంచాయతీ అయినా పట్టణ వాతావరణాన్ని తలపిస్తుంది. ఉదయం ఐదు గంటలకే పంచాయతీ కార్మికులు పారిశుధ్య పనులు మొదలుపెడతారు. చెత్తసేకరణ వాహనాలు వాడవాడలా తిరిగి చెత్త సేకరించి తీసుకెళ్తాయి. ఉదయం ఏడుగంటలకే ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్ల సరఫరా మొదలవుతుంది. అంగన్వాడీ కేంద్రాలు, వైద్యారోగ్య సబ్ సెంటర్, ప్రాథమిక పశువైద్య కేంద్రం, బతుకమ్మ ఘాట్, చెంతనే ప్రభుత్వ కార్యాలయాలు, ఆన్లైన్ సేవల కోసం మీ సేవా కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల బ్రాంచీలు వంటి అనేక సదుపాయాలు, సౌకర్యాలు, వసతులు ఈ గ్రామం సొంతం. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ గ్రామం ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగింది. 3 వేల జనాభా నుంచి మొదలై నేడు 18,500కు చేరింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంచాయతీ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. పస్తుతం పంచాయతీలో 1,045 మంది ఆసరా పింఛన్దారులున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా 195 మందికి రూ.1.95 కోట్ల మేర లబ్ధి చేకూరింది. 180 మంది వరకు సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం పొందారు. ఇక మిగిలిన పథకాలూ సరేసరి.
అభివృద్ధికి చిరునామాగా నిలిచిన ఈ గ్రామంలో వాడవాడలా దాని ఫలాలు కన్పిస్తాయి. గడిచిన రెండేళ్లలోనే సుమారు రూ.10 కోట్ల పైగా నిధులు వెచ్చించి అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. వీధివీధినా సీసీ రోడ్లు దర్శనమిస్తాయి. ఆధునిక అంగన్వాడీ కేంద్రం, మంచినీటి ట్యాంకు, రూ.4 లక్షలతో చేపట్టిన క్రీడా ప్రాంగణం, రూ.36 లక్షలతో కొనుగోలు చేసిన మూడు చెత్త సేకరణ ట్రాక్టర్లు, రూ.36 లక్షలతో కొనుగోలు చేసిన స్వచ్ఛ భారత్ ఆటోలు, రూ.20 లక్షలతో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్లు, రూ.6 లక్షలతో నిర్మించిన బతుకమ్మ ఘాట్ వంటివన్నీ కన్పిసాయి. ఇవిగాక ఇటీవల నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి జిల్లాకు వచ్చిన సీఎం కేసీఆర్.. పెద్దతండా అభివృద్ధికి మరో రూ.10 కోట్ల నిధులు ప్రకటించారు. వాటితో మరిన్ని అభివృద్ధి పనులు జరుగనున్నాయి.
మండలంలో అతిపెద్ద పంచాయతీ అయిన పెద్దతండా గ్రామం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతో అభివృద్ధిని సాధించింది. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతాం. డివైడర్లతోపాటు ప్రతి వీధుల్లోనూ సీసీ రోడ్లు నిర్మిస్తాం. పంచాయతీ అభివృద్ధికి రూ.10 కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు గ్రామ ప్రజలు రుణపడి ఉంటారు.
-బెల్లం ఉమ, ఎంపీపీ, ఖమ్మం రూరల్
గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాం. పల్లెప్రకృతి వనంలో పెంచిన మొక్కలను ప్రతి ఇంటికీ పంపిణీ చేస్తాం. ఇప్పటికే కాలనీల్లో వేలాది మొక్కలు నాటి ట్రీ గార్డులు ఏర్పాటు చేశాం. 60 మంది పారిశుధ్య కార్మికులు నిత్యం వీధులను శుభ్రం చేస్తుంటారు. ఇంటింటికీ తాగునీరు అందుతుంది. డ్రైనేజీలను కూడా నిత్యం శుభ్రం చేయిస్తుంటాం.
-రామకృష్ణ, పంచాయతీ సెక్రటరీ, పెద్దతండా