చింతకాని, మార్చి 2 : ఏటా మాదిరిగానే పంట దిగుబడిపై ఆశ పెట్టుకున్నాడు. అప్పు చేసి.. సాగర్ నీరు, బావులు, చెరువును నమ్ముకొని తనకున్న రెండెకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాడు నరసింహాపురం గ్రామానికి చెందిన రైతు కర్రి నాగేశ్వరరావు. నవంబర్ నెలలో ఎకరంన్నర భూమిలో మొక్కజొన్న వేయగా.. పంట బొండా, పీచు దశలో ఉంది. మరో అరెకరం భూమిలో డిసెంబర్ చివరి వారంలో మొక్కజొన్న సాగు చేశాడు. అప్పటివరకు బావులు, చెరువులో ఉన్న నీటిని పంటకు పారించడంతో ఏపుగా వచ్చింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. గత ఏడాది డిసెంబర్ నుంచి సాగర్ జలాశయం నుంచి ఆరుతడి పంటలకు తెలంగాణ ప్రభుత్వం నీటిని విడుదల చేయలేదు. ఒక్కసారైనా ప్రభుత్వం నీళ్లు విడుదల చేస్తుందనే ఆశతో ఆరుతడి పంటలు సాగు చేసిన రైతులతోపాటు నాగేశ్వరరావు కూడా ఎదురు చూశాడు. ఈ క్రమంలో నీరందక ఎండిపోతున్న మొక్కజొన్న పంటను చూసి.. కనీసం పశువుల మేతకైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో పంటను కుటుంబ సభ్యులు కోసి పశువులకు మేతగా వేస్తున్నారు. అరెకరంలో సాగు చేసిన లేత మొక్కజొన్న పంట మరో రెండు రోజుల్లో కోత పూర్తవుతుందని, తర్వాత మిగిలిన ఎకరంన్నరలో కోత మొదలుపెడతానని రైతు ఆవేదనతో తెలిపాడు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు మిగిలిన రైతుల పొలాలకు సాగునీరు అందించి ఆదుకోవాలని సదరు రైతు కోరాడు. మిగిలిన ఆయకట్టు రైతులు కూడా తమ పంటలకు నీరు అందించాలని, చేతికొచ్చిన పంటలను కాపాడాలని ముక్తకంఠంతో కోరుతున్నారు.
నాకున్న రెండెకరాల్లో అప్పు చేసి.. రూ.40 వేల పెట్టుబడితో ఆరుతడి పంటగా మొక్కజొన్న పైరు వేశాను. డిసెంబర్లో వచ్చిన తుఫాన్ వల్ల నేల పదునుతో రెండు విడతలుగా పంట సాగు చేశాను. భూగర్భ జలాలు పూర్తిగా పడిపోవడంతో నేను రెండెకరాల్లో సాగు చేసిన పైరు పూర్తిగా వడబడిపోయింది. చేసేది లేక పశువుల మేతగా వాడుకుంటున్నా. తోటి రైతులు నష్టపోకుండా ఉండాలంటే ప్రభుత్వం ఒక్కసారైనా ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులను కోరుకుంటున్నా.