ఖమ్మం వ్యవసాయం, జూన్ 4 : రైతులు కొనుగోలు చేసిన విత్తనాలకు వ్యాపారులు విధిగా బిల్లులు ఇవ్వాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం.విజయనిర్మల ఆదేశించారు. ఖమ్మం నగరంలోని త్రీటౌన్ ప్రాంతంలో ఉన్న పలు విత్తన దుకాణాలు, గోదాములను మంగళవారం ఆమె తనిఖీ చేశారు. గోడౌన్లో స్టాక్‌ను, రికార్డులను పరిశీలించారు. విత్తనాలు కొనుగోలు చేసేందుకు దుకాణాలకు వచ్చిన రైతులతో ఆమె మాట్లాడారు. రోజువారీ క్రయవిక్రయాలకు సంబంధించిన వివరాలు నమోదు చేయని కృషి ఆగ్రో రైతుసేవా ఏజెన్సీకి నోటీసులు జారీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రోజువారీ క్రయవిక్రయాలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు రిజిస్టర్లో నమోదు చేయాలని, లేదంటే షాపు యజమానులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విత్తనాలు, ఎరువుల దుకాణాలకు వచ్చే రైతులకు నాణ్యమైన విత్తనాలను అందజేయాలని, నకిలీ విత్తనాలు అంటగడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు లైసెన్స్‌లను రద్దు చేస్తామని హెచ్చరించారు. నిబంధనలకు అనుగుణంగా క్రయవిక్రయాలు జరగాలన్నారు. కార్యక్రమంలో అర్బన్ వ్యవసాయ శాఖ అధికారి కిశోర్‌బాబు, జిల్లా వ్యవసాయ శాఖ ఏవో, టెక్నికల్ అధికారి చాయారాజ్ తదితరులు పాల్గొన్నారు.