పోడు భూములకు పట్టాలిచ్చేందుకు రంగం సిద్ధమవుతున్నది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో క్షేత్రస్థాయిలో ఆ దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయి. యుద్ధప్రాతిపదికన పోడు భూములపై సర్వే పూర్తి చేయించారు. వారం పది రోజుల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అర్హులైన రైతులకు పట్టాలు అందివ్వనున్నారు. పోడు భూముల చట్టం కేంద్రం పరిధిలో ఉన్నప్పటికీ సీఎం మధ్యేమార్గంగా ప్రత్యేక జీవో 140ను తీసుకొచ్చి గిరిజనులకు న్యాయం చేస్తున్నారు. కాగా, భద్రాద్రి జిల్లాలో 10,13,698 ఎకరాల్లో అటవీశాఖ భూమి ఉండగా.. కొంత భూమి ఆక్రమణకు గురైంది. రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాకు చెందిన 44,040 మంది గిరిజన రైతులు 1,33,172 ఎకరాల్లో పోడు సాగు చేపడుతున్నట్లు అధికారులు గుర్తించారు. వీరికి త్వరలో పోడు పట్టాలు ఇవ్వడనుండడంతో గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని ముక్తకంఠంతో పేర్కొంటున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, మే 4 (నమస్తే తెలంగాణ): మారుమూల గిరిజన గూడేలు.. అక్కడ ఉపాధి పెద్దగా దొరకదు.. అప్పుడో ఇప్పుడో వ్యవసాయ పనులకు వెళ్తే కాసింత కూలి గిడుతుంది. వచ్చిన ఆ కొంత కూలితోనే గిరిజనులు కుటుంబాన్ని పోషించుకుంటారు. ప్రాథమిక అవసరాలకు తప్ప కూలి దేనికీ సరిపోదు. తాతలు తండ్రుల కాలం నుంచి వారికి పోడు భూమే ఆధారం. సదరు భూమికి పట్టాలు ఉంటే భద్రత ఉంటుందని, ప్రభుత్వం పట్టాలు ఇస్తే బాగుంటుందని గతంలో ఎన్నో ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నారు. అయినా ఆయా ప్రభుత్వాల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఉమ్మడి పాలనలో నాటి ప్రభుత్వం 2008- 12లోపు కేవలం 24 వేల మందికి పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకున్నదే తప్ప మిగిలిన వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. పోడు సమస్యకు సీఎం కేసీఆర్ శాశ్వత పరిష్కారం చూపేందుకు సిద్ధమయ్యారు. యుద్ధప్రాతిపదికన పోడు భూములపై సర్వే పూర్తి చేయించి అర్హులకు పోడు భూముల పట్టా లు అందివ్వనున్నారు. వారం పది రోజుల్లో పట్టాలు గిరిజన రైతుల చేతుల్లోకి రాబోతున్నాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అర్హులకు పట్టాలు ఇవ్వనున్నారు. సీఎం పోడు భూముల చట్టం కేంద్రం పరిధిలో ఉన్నప్పటికీ మధ్యేమార్గంగా ప్రత్యేక జీవో 140ను తీసుకువచ్చి గిరిజనులకు న్యాయం చేస్తున్నారు.
భద్రాద్రి జిల్లా రాష్ట్రంలోనే అత్యధిక అటవీ ప్రాంతం కలిగిఉన్న జిల్లా. జిల్లాలోని 21 మండలాల పరిధిలో 332 పంచాయతీలు ఉండగా వీటి పరిధిలో మొత్తం 726 హేబిటేషన్లు ఉన్నాయి. ప్రాథమికంగా 65,616 మంది పోడు రైతులు 2,41,107 ఎకరాలు, ఇతరులు 17,725 మంది 58,161 ఎకరాల్లో పోడు సాగు చేస్తున్నారు. గతేడాది అక్టోబర్లో అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పోడు సర్వే చేపట్టారు. ఊరూరా గ్రామసభలు నిర్వహించారు. డివిజన్ స్థాయి కమిటీలోనూ ఆమోదం తీసుకున్నారు. మండల స్థాయిలో తహసీల్దార్, ఎంపీడీవో, పంచాయతీ సెక్రటరీలు, వీఆర్ఏలు, అటవీశాఖ అధికారులు, డివిజన్ స్థాయిలో ఆర్డీవో, ఎఫ్డీవో, డీడీ అధికారులు విచారణ చేపట్టారు. చివరగా కలెక్టర్ సమక్షంలో జిల్లా స్థాయి కమిటీ ఆమోదంతో సర్వే ప్రక్రియ పూర్తయింది. ఆరు నెలల వ్యవధిలోనే సర్వే చేపట్టి పోడు పట్టాలు ఇస్తుండడం విశేషం.
పోడు హక్కులపై సీఎం కేసీఆర్ ప్రత్యేక జీవో 140 జారీ చేసి, దశాబ్దాల సమస్యకు పరిష్కారం చూపినందుకు పోడు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్లో అటవీ భూముల జోలికి వెళ్లబోమని ముక్తకంఠంతో చెప్తున్నారు.మరోవైపు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను గిరిజన సంఘాల నాయకులూ స్వాగతిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో పోడు పట్టాలు ఇవ్వడం చరిత్రలో నిలిచిపోతుందని కితాబునిస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా 10,13,698 ఎకరాల్లో అటవీశాఖ భూమి ఉంది. సదరు భూమిలో కొంత ఆక్రమణకు గురైంది. ఆక్రమణలకు గురైన ప్రాంతాల్లో సక్రమంగా పోడు చేసుకుంటున్న రైతులకు నష్టం కలగకుండా మూడంచెల వ్యవస్థ ద్వారా ప్రభుత్వం సర్వే చేపట్టింది. అర్హులను గుర్తించింది. గిరిజన ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు,మంత్రుల అభిప్రాయాన్ని పరిగణణలోకి తీసుకుని సీఎం కేసీఆర్ పోడుభూములపై సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇచ్చిన నివేదికల ఆధారంగా 140 జీవోను విడుదల చేశారు. పోడుభూములకు పట్టాలిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాకు చెందిన 44,040 మంది గిరిజన రైతులు 1,33,172 ఎకరాల్లో సక్రమంగా పోడు సాగు చేపడుతున్నట్లు అధికారులు గుర్తించారు. వీరికి త్వరలో పోడు పట్టాలు అందనున్నాయి.
గిరిజనుల పాలిట దేవుడు సీఎం కేసీఆర్. పోడు పట్టాల కోసం దశాబ్దాల నుంచి ఎదురుచూస్తున్నాం. గతంలో ఏ ప్రభుత్వమూ మా విన్నపాన్ని పట్టించుకోలేదు. ఆ సాహసం కేసీఆర్ చేశారు. యుద్ధప్రాతిపదికన సర్వే చేయించి పట్టాలు ఇస్తున్నారు. కేసీఆర్ పేరు చెప్పుకుని గిరిజనులు తరతరాలు బతుకుతాయి.
– మోకాళ్ల వీరస్వామి, పోడు రైతు,
ముత్తాపురం, గుండాల మండలం
గిరిజనులు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న పోడు సమస్యకు సీఎం కేసీఆర్ చక్కటి పరిష్కారం చూపారు. ఒక్క భద్రాద్రి జిల్లాలోనే 44 వేల మంది పోడు రైతులు పట్టాలు పొందనున్నారు. దేశంలోని మరే ఇతర రాష్ట్రంలోనూ ఇది సాధ్యం కాలేదు. సీఎం పెద్దమనసుతో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ నెలలోనే అర్హులందరికీ పట్టాలు అందుతాయి.
– రేగా కాంతారావు, ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే