పంచాయతీ ఎన్నికల మలిదశ పోరుకు సమయం ఆసన్నమైంది. భద్రాద్రి జిల్లాలోని అన్ని పార్టీలూ రెండో విడత ఎన్నికల సమరంలోకి దూకాయి. ఇప్పటికే హోరాహోరీ ప్రచారాన్ని సాగించారు. ఈ నెల 14న ఎన్నికలు జరుగనుండడంతో శుక్రవారంతో ప్రచారం పరిసమాప్తమైంది. ఈ రెండో విడతలో జిల్లాలోని ఏడు మండలాల పరిధిలో ఉన్న 156 పంచాయతీలకు ఎన్నికలు జరుగాల్సి ఉంది. కోర్టు అభ్యంతరాలతో రెండు పంచాయతీలకు అధికారులు ఎన్నికలు నిర్వహించడం లేదు. ఇక 154 పంచాయతీల్లో ఇప్పటికే 16 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 138 పంచాయతీలకు ఈ నెల 14న ఎన్నికలు జరుగనున్నాయి. ఈ 138 పంచాయతీల్లో 408 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక 1,384 వార్డులకుగాను 248 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 1,123 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ వార్డుల్లో 2,598 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. విజయం కోసం అన్ని పార్టీలు శక్తియుక్తులు ప్రయోగిస్తున్న వేళ.. రాష్ట్రంలో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్, సీపీఐ పార్టీల నాయకులు ఈ విడతలో పాల్వంచ, చుంచుపల్లి మండలాల్లో ఎవరికి వారుగా పోటీలో నిలిచారు
– ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ అశ్వారావుపేట, డిసెంబర్ 12
రెండో విడత నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఈ నెల 6న ముగిసింది. ఆ తరువాత పోటీలో ఉన్న అభ్యర్థులతో ఎన్నికల అధికారులు తుది జాబితా విడుదల చేసి గుర్తులు కేటాయించారు. అప్పటి నుంచి శుక్రవారం వరకూ అభ్యర్థులు, వారిని బలపరుస్తున్న పార్టీల నాయకులు హోరాహోరీ ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, పాల్వంచ నాయకురాలు సింధు తపస్వి తదితరులు ఆయా మండలాల్లో విస్తృత ప్రచారం చేశారు.
‘భద్రాద్రి’లో 16 పంచాయతీలు ఏకగ్రీవం..
భద్రాద్రి జిల్లాలో తొలి విడతలో 14 పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. రెండో విడతలో 16 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 138 జీపీలకే ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే పంచాయతీలకు మెటీరియల్ సిద్ధమైంది. అశ్వారావుపేట మండలంలో ఒక పంచాయతీ కాంగ్రెస్, మరో పంచాయతీ స్వతంత్ర అభ్యర్థికి, దమ్మపేటలో మూడు కాంగ్రెస్‌కు, ఒకటి బీఆర్ఎస్కు ఏకగ్రీవమయ్యాయి. అలాగే.. ములకలపల్లిలో ఒకటి, చండ్రుగొండలో రెండు, అన్నపురెడ్డిపల్లిలో రెండు చొప్పున కాంగ్రెస్‌కు ఏకగ్రీవమయ్యాయి. పాల్వంచలో నాలుగు, చుంచుపల్లిలో ఒకటి సీపీఐకి ఏకగ్రీవమయ్యాయి.
కాంగ్రెస్, సీపీఐ ఎవరికి వారే..
రాష్ట్రమంతా పొత్తు ఉన్నప్పటికీ కొత్తగూడెంలో పొత్తు లేదంటూ సీపీఐ, కాంగ్రెస్ నాయకులు ఎవరికి వారుగా పోటీలో నిలిచారు. ప్రత్యర్థులుగా మారి ‘నువ్వా నేనా’ అన్నట్లుగా తలపడుతున్నారు. ముఖ్యంగా పాల్వంచ, చుంచుపల్లి మండలాల్లో ఆ రెండు పార్టీల నాయకులు పొత్తు ధర్మాన్ని పక్కన పెట్టి సర్పంచ్ స్థానాల్లోనూ, వార్డు స్థానాల్లోనూ పోటీపడుతున్నారు. సీపీఐ బలపర్చిన అభ్యర్థుల తరఫున కొత్తగూడెం ఎమ్మెల్యే, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రచారం చేస్తున్నారు. కొన్నిచోట్ల ఈ రెండు పార్టీలు బద్ధశత్రువులుగా మారి పరస్ఫర ఆరోపణలు కూడా చేసుకుంటున్నాయి.
‘ఖమ్మం’లో 120 పంచాయతీలకు ఎన్నికలు..
ఖమ్మం జిల్లాలోని ఆరు మండలాల్లో ఈ నెల 14న రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. కామేపల్లి, ఖమ్మం రూరల్, కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, ముదిగొండ మండలాల్లోని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఈ విడతలో ఆరు మండలాల్లోని 183 సర్పంచ్ స్థానాలకు, 1,686 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. అయితే, ఇందులో 23 సర్పంచ్ స్థానాలు, 306 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఒక వార్డుకు నామినేషన్ దాఖలు కాలేదు. ఈ ఏకగ్రీవ పంచాయతీలు, వార్డులు మినహాయించి 160 సర్పంచ్ స్థానాలకు, 1,379 వార్డు స్థానాలకు ఈ నెల 14న అధికారులు ఎన్నికలు నిర్వహించనున్నారు. సర్పంచ్ స్థానాలకు 451 మంది, వార్డు స్థానాలకు 3,352 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
‘పంపిణీ’ షురూ!
భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో రెండో విడత ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రంతో ముగియడంతో ఆ పార్టీల నాయకులు తాము బలపర్చిన అభ్యర్థుల తరఫున ‘పంపిణీ’ షురూ చేశారు. నగదుతోపాటు మద్యం బాటిళ్లు వంటివి ఓటర్ల ఇళ్లకు వెళ్లి అందిస్తూ వారిని ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఓటరు స్లిప్పు ఉంటేనే అభ్యర్థులు నగదు ఇస్తారన్న ప్రచారంతో కొన్ని గ్రామాల్లోని ప్రజలు కూడా ఓటరు స్లిప్పులతో ఎదురుచూస్తున్నారు. ఆయా గ్రామాల్లో కొందరు అభ్యర్థులు ఓటుకు రూ.500 చొప్పున పంపిణీ చేస్తుండగా.. ప్రత్యర్థులు రూ.1,000 చొప్పున పంపిణీ చేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. మద్యాన్ని కూడా ఏరులై పారిస్తున్నారు. తొలి విడతలో కూడా ఓటర్లు అభ్యర్థులందరి దగ్గరా నగదు తీసుకుంటున్నారు. ఓటు మాత్రం తమకు నచ్చిన అభ్యర్థికే ఓటు వేస్తున్నారు. అభ్యర్థులు తమ క్యాడర్‌తో రేయింబవళ్లూ ప్రచారం చేయిస్తూ వారికి మందు విందులను ఏర్పాటు చేస్తున్నారు.
ప్రముఖుల ప్రచారం..
రెండో విడత ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో ప్రముఖ నాయకులు విస్తృత ప్రచారం చేశారు. ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, హరిప్రియ, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు తదితరులు గ్రామగ్రామానికీ వెళ్లి బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేశారు. పలు మండలాల్లో బీఆర్ఎస్, సీపీఎం కూటమిగా ఏర్పడి పోటీ చేస్తుండడంతో మెజారిటీ స్థానాల్లో విజయావకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
‘ఖమ్మం’లో 2,51,327 మంది ఓటర్లు
మామిళ్లగూడెం, డిసెంబర్ 12: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు ఖమ్మం కలెక్టర్ అనుదీప్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. కామేపల్లి, ఖమ్మం రూరల్, కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లోని 183 గ్రామ పంచాయతీలు, 1,686 వార్డుల స్థానాలకు రెండో విడత ఎన్నికలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో ఒక్క వార్డుకు నామినేషన్ దాఖలు కాలేదని, 23 పంచాయతీలు, 306 వార్డులు ఏకగ్రీవమయ్యాయని వివరించారు. మిగిలిన 160 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. వీటిల్లో మొత్తం 451 మంది సర్పంచ్ అభ్యర్థులుగా పోటీలో ఉన్నట్లు వెల్లడించారు. ఇక 1,379 వార్డుల స్థానాల్లో 3,352 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.
ఈ ఎన్నికల నిర్వహణకు 2,023 బ్యాలెట్ బాక్సులు, 1,831 మంది పోలింగ్ అధికారులు, 2,346 మంది ఓపీవోలను సిద్ధం చేశామన్నారు. 28 లొకేషన్లలో 304 క్రిటికల్ కేంద్రాలు ఉన్నాయని, అక్కడ సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ రెండో విడత పంచాయతీ ఎన్నికలలో మొత్తం 2,51,327 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా వినియోగించుకోవాలని కోరారు.