‘ పేరు గొప్ప.. ఊరు దిబ్బ..’ అన్నట్లుగా ఉంది కాంగ్రెస్ సర్కారు తీరు. దేశానికి వెన్నెముకలా ఉన్న రైతులకు ‘రైతుభరోసా’ ఇవ్వడంలో మీనమేషాలు లెక్కపెడుతున్నది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలోని రైతులకు ఏనాడూ పెట్టుబడి సాయం సక్రమంగా ఇచ్చింది లేదు. వ్యవసాయ సీజన్ ప్రారంభంలో ఇవ్వాల్సిన డబ్బులు తీవ్ర జాప్యం చేస్తూ ఎప్పటికో ఇవ్వడం.. అదీ కొందరికే ఇచ్చి చేతులు దులుపుకోవడం రేవంత్ సర్కార్‌కు అలవాటుగా మారింది. ఈ యాసంగి సీజన్లో అయితే విచిత్రంగా వాయిదాల పద్ధతిలో రైతుభరోసా పథకాన్ని అమలు చేస్తున్నది.
మొదటి విడతలో ఒక ఎకరానికి మాత్రమే రూ.6 వేలు జమ చేయగా.. రెండో విడతలో మరో ఎకరానికి ఇస్తామని.. ఇక మూడో విడతలో ఇంకొంత.. అంటూ చెప్పుకొచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఈ యాసంగి సీజన్లో మొత్తం రూ.355 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. కేవలం రూ.98 కోట్లు మాత్రమే ఇచ్చింది. రైతులు 1,91,092 మంది ఉండగా.. 1,77,201 మందికి మాత్రమే డబ్బులు జమ కావడం గమనార్హం. ఏదేమైనా యాసంగి సీజన్ పూర్తికావొస్తుండడంతో రెండో విడత డబ్బులపై రైతుల్లో అనుమానం కలుగుతున్నది. ఇక మూడో విడత దేవుడెరుగు అన్నట్లు ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై అన్నదాతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : రైతుల సంక్షేమ పథకాలకు ప్రతిసారి ఏదో రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం గండికొడుతున్నది. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి చెయ్యలేక చేతులెత్తేసింది. కొన్ని బ్యాంకుల్లో రైతుల ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతా నంబర్లు సరిగా లేవనే సాకుతో ఎగనామం పెట్టింది. రెండు బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారని, రుణం రూ.2 లక్షలు దాటిందని చెప్పి మరి కొంతమందిని రుణమాఫీకి అనర్హులను చేసింది. దీంతో వారంతా రుణమాఫీకి దూరమయ్యారు. ఇక రైతుభరోసా పథకం సంగతికి వస్తే.. ప్రతిసారీ అర్హులకు ఎగనామమే.
ఈ యాసంగి సీజన్లో అసలు ఇచ్చిందే ఎకరం పంటకు. అందులో బ్యాంకు నంబర్లు తప్పు ఉన్నాయని కొందరికి డబ్బులు వారి ఖాతాల్లో పడలేదు. మార్చి 22న సిద్ధిపేట జిల్లాలో భారీ బహిరంగ సభ పెట్టి రైతుభరోసా డబ్బులు మంజూరు చేస్తున్నామని గొప్పలు చెప్పి.. తీరా ఒక్క ఎకరానికే ఇచ్చి చేతులు దులుపుకుంది. భద్రాద్రి జిల్లాలో ఇప్పటికీ 13,885 మంది రైతులకు రైతుభరోసా రాకపోవడం గమనార్హం. ఇదేగాక 2,300 మంది కొత్త రైతులకూ రైతుభరోసా జమ కాలేదని రైతులు చెబుతున్నారు. వాయిదాల పద్ధతిలో ఇచ్చే ‘రైతుభరోసా’ సొమ్ములు తొలివిడతలోనే జమకాలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ తీరుపై అన్నదాతల అసహనం
ఎన్నో మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు రైతులకు సరిపడా యూరియా ఇవ్వకపోవడం.. కొత్త యాప్‌లను అందుబాటులోకి తీసుకొచ్చి యూరియా కొరతను సృష్టించింది. మరోవైపు నకిలీ విత్తనాలు విక్రయాలు చేసి రైతుల పంటలను దిగుబడి లేకుండా చేసింది. పంటలను కొనుగోలు చేయకుండా జ్యాపం చేయడంతో రైతులు దళారులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. పత్తి కూడా సీసీఐలో కొనుగోలు లేకపోవడంతో దళారులే పత్తిని కొనుగోలు చేశారు. ఎటొచ్చి కాంగ్రెస్ సర్కారు రైతుల నెత్తినే టోపీ పెట్టింది.
అందరికీ రైతుభరోసా వస్తుంది..
ప్రతి రైతుకూ మొదటి విడతలో డబ్బులు పడాలి అనే ఉద్దేశంతో ఎకరానికి రైతుభరోసా వేశారు. కొంతమంది బ్యాంకు ఖాతా నెంబర్లు తప్పు ఉండటంతో వారికి పడలేదు. సరిచేస్తున్నాం. ప్రతి ఒక్కరికీ సొమ్ములు పడతాయి. రెండో విడత ఈ నెల 20వ తేదీన వస్తాయన్నారు. తొలివిడతలో ఇప్పటివరకు రూ.98 కోట్లు జమ అయ్యాయి. సీజన్ చివరి కల్లా మొత్తం అందరి రైతులకు డబ్బులు జమ అవుతాయి.
-వి.బాబూరావు, డీఏవో, భద్రాద్రి కొత్తగూడెం
రైతులను పట్టించుకోని ప్రభుత్వం
రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఏమ్రాతం పట్టించుకోవడం లేదు. రైతులకు అమలు చేయాల్సిన రుణమాఫీ పథకం దగ్గర నుంచి రైతుభరోసా వరకు సరిగా అమలు చేయకుండా మొండిచెయ్యి చూపిస్తున్నది. ఎరువులను కూడా సక్రమంగా అందించలేకపోతున్నది. మొన్నటివరకు ఎరువుల కోసం రోజంతా క్యూలో నిల్చున్నాం. దీంతో అటు పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
-పెద్ది వేణు, రైతు సంఘం నాయకుడు, చండ్రుగొండ
అప్పు చేసి పంటలు సాగు చేశాం..
రైతుభరోసా వస్తదన్న నమ్మకంతో బయట అప్పులు చేసి పంటలు సాగుచేశాం.. తీరా చూస్తే ఎకరానికే డబ్బులు ఇచ్చారు. అవి ఏమూలకు వస్తయి. అసలే ఎరువుల ధరలు బాగా పెరిగాయి. ఇచ్చింది ఎకరానికి ఆరు వేలు. ఎన్ని కట్టలు వస్తాయో ఆలోచించండి. డీజిల్ రేటు పెరిగింది.. దుక్కులకే అవి సరిపోయాయి. మధ్యలో అకాల వర్షం వచ్చి పంటలను నాశనం చేసింది. దేనికీ పరిహారం ఇవ్వలేదు.
-అచ్చా అప్పారావు, రైతు, తిప్పనపల్లి, చండ్రుగొండ
కేసీఆర్ ఇచ్చినట్లు ఇస్తలేరు..
గత సీఎం కేసీఆర్ పాలనలో ఠంఛన్‌గా రైతుబంధు డబ్బులు పడ్డాయి. ఇప్పుడు అలాంటి ముచ్చటే లేదు. అసలు వస్తాయో రావో కూడా తెలియడం లేదు. అధికారులు వస్తాయంటున్నారు. రాకపోతే మేమేంజేయాలి అంటున్నారు. కట్ట యూరియా కోసమే చుక్కలు చూపెట్టారు. ఈ రైతుభరోసా డబ్బుల కోసం ఎన్ని చుక్కలు చూడాలో.
-బానోత్ వీరూ, రైతు, ఏ కాలనీ తండా, టేకులపల్లి