ఖమ్మం, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఈ నెల 30న జరుగనన్న శాసనసభ ఎన్నికల కోసం శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. శుక్రవారం నుంచి శాసనసభా నియోజకవర్గ కేంద్రాల్లో రిటర్నింగ్ అధికారులు పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ ప్రక్రియ 10 వరకు కొనసాగనుంది. ఇందుకోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా అధికారులు పోటీ చేసే అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలు, నియమాలు, అవసరమైన ధ్రువపత్రాల వివరాలను రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అందుబాటులో ఉంచారు. నామినేషన్ దాఖలు చేసేందుకు అభ్యర్థులు అనుసరించాల్సిన పద్ధతులు, జాగ్రత్తలను వివరించేందుకు కార్యాలయంలో సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం నుంచి నామినేషన్లు ప్రారంభమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల కమిషన్ గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్రీయ రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు చెల్లించే డిపాజట్లు ఒకే రకంగా ఉన్నాయి.
జనరల్ స్థానం నుంచి పోటీ చేసే జనరల్ అభ్యర్థులు రూ.10 వేలు, ఎస్సీ, ఎస్టీ స్థానాలు లేదా జనరల్ స్థానాల నుంచి పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5 వేలను డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు నోటరీ ద్వారా తమ ఆస్తులు, ఆదాయ వ్యయాలతోపాటు తమపై ఉన్న కేసుల వివరాలను నామినేషన్ పత్రాల్లో చూపించాల్సి ఉంటుంది. నామినేషన్ వేస్తున్న అభ్యర్థుల పేరు ప్రస్తుతం ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఓటర్ల జాబితాలో తప్పనిసరిగా నమోదై ఉండాలి. అభ్యర్థుల ప్రతిపాదకులు కూడా స్థానిక నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగి ఉండాలి. ప్రతి అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖాలు చేసేందుకు కమిషన్ అవకాశం కల్పించింది. ఈ నెల 10న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది. వచ్చిన నామినేషన్లను 13న స్క్రూట్నీ చేస్తారు. పోటీలో ఉండేందుకు అర్హత ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. అదే రోజు నుంచి 15వ తేదీ సాయంత్రం వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. ఆ గడువు ముగిసిన వెంటనే ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. నామినేషన్లు స్వీకరించే ఆర్వో కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యాలయానికి 100 మీటర్ల వరకు నిర్దేశించిన వారిని మాత్రమే అనుమతిస్తారు. పోలీసులు 144 సెక్షన్‌ను అమలు చేయనున్నారు.
జిల్లాలో నామినేషన్ల స్వీకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. ఖమ్మం రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాలేరు అసెంబ్లీ నియోజకవర్గ, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలను గురువారం ఆయన తనిఖీ చేశారు. ప్రక్రియపై రిటర్నింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఖమ్మం రిటర్నింగ్ అధికారి ఆదర్శ్ సురభి, పాలేరు రిటర్నింగ్ అధికారి ఎం.రాజేశ్వరి, ఖమ్మం రూరల్ ఏసీపీ బస్వారెడ్డి, తహసీల్దార్లు రామకృష్ణ, సీహెచ్ స్వామి, అధికారులు పాల్గొన్నారు.