ఆరంభ శూరత్వమే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క పనిని కూడా సంపూర్ణంగా పూర్తిచేసిన దాఖలాలు కనిపించడం లేదు. ‘ధరణి’ పోర్టల్ స్థానంలో ‘భూ భారతి’ తీసుకొచ్చి రైతుల భూ సమస్యలన్నీ త్వరితగతిన పరిష్కరిస్తామని దరఖాస్తులు స్వీకరించింది. ఆగస్టు 15వ తేదీలోగా ఒక్క సమస్య కూడా పెండింగ్ లేకుండా చేస్తామని గ్రామ రెవెన్యూ సభల్లో ప్రజాప్రతినిధులు గొప్పలు చెప్పుకొచ్చారు. తీరా చూస్తే గడువు ఇంకా వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది.
కానీ, ఇప్పటివరకు రైతులకు నోటీసులు జారీచేసే ప్రక్రియనే ఇంకా పూర్తికాలేదు. దీంతో తమ భూ సమస్యలకు పరిష్కారం ఎప్పుడు లభిస్తుందోనని రైతులు అయోమయంలో పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడమే కానీ చేయడం కష్టమేనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉంటే.. సాదాబైనామాలపై ఇంకా స్పష్టతనివ్వకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇందిరమ్మ పాలనలో భూ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
– అశ్వారావుపేట, ఆగస్టు 9
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీల్లో భూ సమస్యల పరిష్కారం ఒకటి. బీఆర్ఎస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ‘ధరణి’లో లోపాలు ఉన్నాయంటూ నిరాధార ఆరోపణలు చేసిన కాంగ్రెస్ సర్కార్ కొత్తగా భూ భారతి పోర్టల్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. అధికారంలోకి వచ్చిన సుమారు ఏడాదిన్నర కాలంపాటు ‘ధరణి’ పోర్టల్ ద్వారానే సేవలు అందించిన రేవంత్‌రెడ్డి సర్కార్ ‘భూ భారతి’ని పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోతున్నది. ఫలితంగా భూ సమస్యలు పరిష్కారంకాక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
గ్రామ రెవెన్యూ ఆఫీసర్ల నియామకాన్ని తక్షణమే చేపట్టి పరిష్కార చర్యలు తీసుకుంటామని ఆర్భాటంగా వెల్లడించినా ఆ ఊసే కనిపించడం లేదు. భూ సమస్యలను పరిష్కరించకుండా మరికొంతకాలం నెట్టుకురావొచ్చనే ఉద్దేశంతో రెవెన్యూ గ్రామసభలు పెట్టి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. వీటిని ఆగస్టు 15వ తేదీ నాటికి పరిష్కరిస్తామని ప్రకటించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా 23 మండలాల్లోని 379 రెవెన్యూ గ్రామాల నుంచి 61,145 మంది రైతులు దరఖాస్తులు చేసుకున్నారు.
అయితే ప్రభుత్వం ప్రకటించిన గడువు మరో వారం రోజుల్లో ముగియనుంది. ఇప్పటివరకు ఒక్క సమస్యకు కూడా పరిష్కారం లభించలేదు. ఇంకా రైతులకు నోటీసులు జారీ చేసే పనిలోనే రెవెన్యూ యంత్రాంగం తలమునకలై ఉంది. ఈ నెల 7వ తేదీ నాటికి 48,421 మంది రైతులకు నోటీసులు అప్లోడ్ చేశారు. కానీ, ఏ ఒక్క రైతుకీ నోటీసులు ఇంకా జారీ చేయలేదు. 12,724 దరఖాస్తులకు నోటీసులు జనరేట్ చేయాల్సి ఉంది. జూన్ 19వ తేదీతో రెవెన్యూ గ్రామసభలు పూర్తయ్యాయి.
తర్వాత రెండోరోజు నుంచే దరఖాస్తులను ఆన్లైన్ చేస్తున్నారు. రోజుకు ఆపరేటర్ 100 నుంచి 200 దరఖాస్తులకు మాత్రమే నోటీసులు జనరేట్ చేస్తున్నాడు. ఈ లెక్కన మిగిలిన సుమారు 13 వేల దరఖాస్తులకు నోటీసులు జనరేట్ చేయాలంటే కనీసం 6 రోజులు పడుతుంది. ఈలోగా ప్రభుత్వం ప్రకటించిన గడువు వచ్చేస్తుంది. ఇంకెప్పుడు నోటీసులు జారీ చేస్తారు…? భూ సమస్యలను పరిష్కరిస్తారు…? అన్న ప్రశ్నలకు సమాధానం దొరక్క రైతులు మదనపడుతున్నారు.
వెంటాడుతున్న సిబ్బంది కొరత
భూ భారతి దరఖాస్తుల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత వెంటాడుతున్నది. ప్రతి మండలంలోనూ రెవెన్యూ సిబ్బంది తక్కువగా ఉన్నారు. దరఖాస్తులను జనరేట్ చేసేందుకు ఇంత సమయం పడుతుంటే ఇక సమస్యల పరిష్కారానికి ఇంకెన్ని నెలలు పడుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. గ్రామ రెవెన్యూ ఆఫీసర్లను నియమిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి ప్రకటించినా ఇప్పటివరకు కొలిక్కి రాలేదు. నియామక ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎప్పుడు తమ సమస్యకు పరిష్కారం లభిస్తుందోనని రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
సాదాబైనామాపై స్పష్టత కరువు
సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారంపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. తెల్లకాగితంపై చేసుకున్న ఒప్పందాలకు చట్టబద్ధత కల్పించాలని రైతుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది. ఎన్నో ఏళ్ల సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశ పడుతున్న రైతులకు సర్కార్ తీరుతో నిరాశే ఎదురవుతున్నది. సాదాబైనామా దరఖాస్తులను ప్రస్తు తం రెవెన్యూ అధికారులు పరిశీలించడం లేదు. ప్రభు త్వం నుంచి సరైన ఆదేశాలు రాకపోవడంతో అ ధికారులు వాటిని ప్రస్తుతానికి పక్కన పెట్టారు.
నోటీసులు జనరేట్ చేస్తున్నాం..
రెవెన్యూ గ్రామసభలో స్వీకరించిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేశాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు నోటీసులు జనరేట్ చేస్తున్నాం. నోటీసులు సిద్ధం చేసిన తర్వాత రైతులకు పంపిణీ చేసి వారి నుంచి సమాధానం తీసుకుని ప్రభుత్వ మార్గదర్శకాలను అనుగుణంగా భూ సమస్యలకు పరిష్కార చర్యలు తీసుకుంటాం.
– రామకృష్ణ, ఇన్చార్జి తహసీల్దార్, అశ్వారావుపేట
గ్రామసభలో దరఖాస్తు చేసుకున్నా..
నా భూమికి కొత్త పాస్ పుస్తకం మంజూరు కాలేదు. రెవెన్యూ గ్రామసభలో దరఖాస్తు చేసుకున్నాను. ఆగస్టు 15వ తేదీలోగా అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని అధికారులు గ్రామసభలో చెప్పారు. కానీ, ఇంతవరకు ఏమి జరిగిందో కూడా సమాచారం లేదు. మరో 6 రోజుల్లో ప్రభుత్వం ప్రకటించిన గడువు ముగుస్తుంది.
– పోలారావు, గిరిజన రైతు, అశ్వారావుపేట