రఘునాథపాలెం, జూన్ 15 : హైవేల నిర్మాణం పేరుతో వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న తమ భూములను లాక్కోవద్దని హెచ్చరిస్తూ భూమి కోల్పోతున్న రైతులు ఆందోళనకు దిగారు. తమకు తెలియకుండా వచ్చి సర్వే చేయడం ఏమిటంటూ ప్రశ్నించారు. భూముల సర్వేను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా వీ వెంకటాయపాలెం వద్ద వైరా ప్రధాన రహదారిపై శనివారం తెల్లవారుజామున రైతులు ఆందోళనకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా వీ వెంకటాయపాలెం రెవెన్యూ పరిధిలో నాగ్‌పూర్ టు అమరావతి గ్రీన్‌ఫీల్డ్ హైవే కోసం రెవెన్యూ అధికారులు పోలీసు పహారా నడుమ శనివారం తెల్లవారుజామున 5 గంటలకు భూ సర్వే చేపట్టారు.
భూములు కోల్పోతున్న రైతులకు ముందస్తు నోటీసులు జారీ చేయకుండానే అధికారులు మూడు బృందాలుగా పోలీసులతో ప్రత్యక్షమయ్యారు. అయితే సర్వే విషయం తెలుసుకున్న రైతులు అక్కడికి రావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో రైతులు వైరా రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో రైతులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు పలువురు రైతులను అరెస్ట్ చేసి రఘునాథపాలెం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తమ భూములు లాక్కోవడం సరికాదంటూ పలుమార్లు అధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించినా పట్టించుకోలేదని పలువురు రైతులు వాపోయారు. రైతులతో సంబంధం లేకుండా సర్వే చేస్తున్న నేషనల్ హైవే అథారిటీ అధికారుల తీరును సీపీఐ(ఎం) మండల కార్యదర్శి నవీన్‌రెడ్డి తప్పుపట్టారు. రైతులతోపాటు ఆందోళనలో పాల్గొన్న ఆయన వ్యవసాయ మంత్రి తుమ్మల ఇలాకాలో రైతులను నిర్బంధిస్తారా అని ఆయన ప్రశ్నించారు.