సీఎం కేసీఆర్ ఆదేశాలతో పోలీస్‌శాఖ అప్రమత్తం
ఉమ్మడి జిల్లాలో విస్తృత తనిఖీలు
జిల్లా, రాష్ట్ర సరిహద్దుల్లో పటిష్ట నిఘా
నేరస్తులను పట్టుకునేందుకు సాంకేతికత వినియోగం
అవసరమైతే మెరుపు దాడులు
ఖమ్మం, ఫిబ్రవరి 12: (నమస్తే తెలంగాణ ప్రతినిధి):గంజాయి రవాణాకు అడ్డూ అదుపూ లేకుండా పోతున్నది. సరుకు తరలించేందుకు అక్రమార్కులు కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. వాహనాల రూపురేఖలు మార్చి ఎవరికీ కనిపించని స్థలంలో దాచిపెట్టి తరలిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర ప్రాంతాలకు రవాణా అయ్యే గంజాయి ఎక్కువగా భద్రాచలం మీదుగా సరిహద్దులు దాటుతున్నది. ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ, బీజాపూర్, సుక్మా, ఒడిశాలోని మలాన్గిరి జిల్లాల్లో భారీగా గంజాయి సాగవుతున్నదని సమాచారం. గంజాయిని ఎండబెట్టి ప్యాకింగ్ చేశాక మలాన్గిరి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని సీలేరు, మోతుగూడెం, చింతూరు మీదుగా భద్రాచలం తరలిస్తున్నట్లు తెలుస్తున్నది. అక్కడి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్రం మీదుగా ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. దీంతో ఈ దందాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. పాత నేరస్తులు, గంజాయి రవాణా, అమ్మకాలతో ప్రమేయం ఉన్న వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచారు. అవసరమైతే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
జిల్లాలో గంజాయి రవాణా, విక్రయాలపై జిల్లా పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు వారాల క్రితం గంజాయి, డ్రగ్స్, గుట్కా వంటి మాదక ద్రవ్యాల అమ్మకాలు, రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు జారీ చేయడంతో పోలీస్‌శాఖ అప్రమత్తమైంది. ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్, భద్రాద్రి ఎస్పీ సునీల్‌దత్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ఛత్తీస్గడ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ నుంచి ఉమ్మడి జిల్లా మీదుగా హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ర్టాలకు రవాణా అవుతున్న గంజాయిని కట్టడి చేశారు. గంజాయి రవాణా కట్టడికి పోలీసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దాడులపై ఇప్పటికే అనేకసార్లు సమీక్షించారు. పోలీసులు ఇప్పటికే పాత నేరస్తులు, గంజాయి రవాణా, అమ్మకాలతో ప్రమేయం ఉన్న వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచారు. సమాచారం అందిన మేరకు అనుమానిత ప్రదేశాల్లో దాడులు చేస్తున్నారు.
రవాణాకు కొత్త దారులు..
గంజాయి రవాణాకు అక్రమార్కులు కొత్త దారులు వెతుకుతున్నారు. వాహనాల రూపురేఖలు మార్చి ఎవరికీ కనిపించని స్థలంలో గంజాయి దాచిపెట్టడం, వాహనాల్లో రహస్య కేబిన్లు ఏర్పాటు చేసి సరుకు దాచిపెడుతున్న ఘటనలు ఇటీవల వెలుగు చూస్తున్నాయి. తాజాగా సత్తుపల్లిలో ఇలా సర్దుబాటు చేసిన వాహనంలోనే పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. ఏ రూపంలో సరుకు రవాణా చేసినా విడిచిపెట్టేది లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా జిల్లాకేంద్రం, జిల్లా సరిహద్దులు, పట్టణాల్లో రద్దీ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామంటున్నారు. రోడ్డు మార్గం ద్వారా రవాణా కష్టమవుతుందని భావించిన అక్రమార్కులు ఇప్పుడు రైలు మార్గాన్ని ఎంచుకుంటున్నారు. గడిచిన వారం రోజుల్లో రైల్వే పోలీసులు రెండుసార్లు రైళ్లలో రూ.10 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం నగరంలో పోలీసులు కొన్ని గంజాయి స్టాక్ పాయింట్లను గుర్తించారు. ఆయా ప్రాంతాలపై వారు ప్రత్యేక నిఘా పెట్టారు. గంజాయి నిల్వకు గతంలో ఆశ్రయం ఇచ్చిన వారిపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. తనిఖీలు, దాడులకు పోలీసులు జాగిలాలను సైతం వినియోగిస్తున్నారు.
పొరుగు రాష్ర్టాల నుంచి..
గంజాయి రవాణా, అమ్మకాలు చేస్తున్న వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని పోలీస్‌శాఖ నిర్ణయించింది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర ప్రాంతాలకు రవాణా అయ్యే గంజాయి ఎక్కువగా భద్రాచలం మీదుగా సరిహద్దులు దాటుతున్నది. ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ, బీజాపూర్, సుక్మా, ఒడిశాలోని మలాన్గిరి జిల్లాల్లో భారీగా గంజాయి సాగవుతున్నదని సమాచారం. అకడ సాగు చేసిన గంజాయిని ఎండ బెట్టి ప్యాకింగ్ చేశాక మలాన్గిరి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని సీలేరు, మోతుగూడెం, చింతూరు మీదుగా భద్రాచలం వస్తున్నట్లు తెలుస్తున్నది.మరో వైపు సీలేరు నుంచి విశాఖపట్నంతో పాటు తమిళనాడుకు రవాణా అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
అక్రమార్కులపై పీడీ యాక్ట్..
గతేడాది ఖమ్మం జిల్లా పోలీసులు రూ.5,19,62,120 విలువైన 3,549 కేజీల గంజాయిని సీజ్ చేశారు. 41 కేసులను నమోదు చేసి 132 మందిని అరెస్ట్ చేశారు. 14 మందిపై పీడీ యాక్ట్ కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పటివరకు 193 కేసులు నమోదు చేసి 566 మందిని అరెస్టు చేశారు. గతేడాది 74 కేసులు నమోదు చేసి 234 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 16,160 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు మొత్తంగా 29,681 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ.25 కోట్ల వరకు ఉంటుందని అంచనా. గంజాయి కట్టడికి అవసరమైతే అక్రమార్కులపై పీడీ కేసులు నమోదు చేయడానికి వెనుకాడబోమని పోలీస్‌శాఖ హెచ్చరిస్తున్నది.
విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు..
ఖమ్మం సీపీ విష్ణు ఎస్ వారియర్, భద్రాద్రి ఎస్పీ సునీల్ దత్ ఎప్పటికప్పుడు పోలీసులను అప్రమత్తం చేస్తున్నారు. డ్రగ్ అఫెండర్స్ ప్రొఫైలింగ్, అనాలసిస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (డీఓపీఏఎంఎస్) ద్వారా వ్యవస్థీకృత నేరాలను ప్రోత్సహిస్తున్న వారిపై నిఘా పెట్టారు. గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగాన్ని కట్టడి చేసేందుకు పోలీస్‌శాఖ విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఉమ్మడి జిల్లాలో ఏసీపీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు విద్యాసంస్థలు, గ్రామ పంచాయతీల్లో సదస్సులు నిర్వహిస్తున్నారు. గంజాయి రవాణా చేసేవారు, విక్రయించే వారి వివరాలను పోలీసులకు తెలపాలని కోరుతున్నారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇస్తున్నారు.