భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 14 (నమస్తే తెలంగాణ) : టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియతో భద్రాద్రి జిల్లా విద్యాశాఖ కార్యాలయం సందడిగా మారింది. ఎంతో కాలంగా భాషా పండితులు తెలుగు, హిందీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు(పీఈటీ) పదోన్నతులు, బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులకు ఇది సంతోషకరంగా ఉన్నా.. విద్యాసంవత్సరం ఆరంభంలోనే ఈ ప్రక్రియను చేపట్టడంతో బడిబాట కార్యక్రమానికి అక్కడక్కడా అవాంతరాలు ఏర్పడ్డాయి. జిల్లావ్యాప్తంగా 2,500 మంది ఎస్జీటీలు ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నా.. ఇంకా 400 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతోపాటు ఎస్జీటీ తత్సమాన భాషా పండితులు తెలుగు, హిందీ, పీఈటీలు 800 మందికి ఉద్యోగోన్నతి కల్పిస్తే వారంతా అప్‌గ్రేడ్ పాఠశాలలకు వెళ్లనున్నారు. దీంతో అప్‌గ్రేడ్ కాని పాఠశాలలతోపాటు ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో పలు సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో లేకపోవడంతో సతమతమవుతున్న విద్యావ్యవస్థ ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలతో మరింత బలహీన పడనున్నదనే సంకేతాలు వస్తున్నాయి. అసలే సర్కారు బడుల్లో సౌకర్యాలు లేక విద్యార్థుల సంఖ్య ఏడాదికేడాది తగ్గుపోతుంటే.. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండానే బదిలీలు, పదోన్నతులు చేపట్టడం వల్ల ఈ విద్యాసంవత్సరం పాఠశాలల్లో టీచర్లు లేక వెలవెలబోయే పరిస్థితి కనిపిస్తోంది. దీనిని అధిగమించడం ప్రభుత్వానికి కత్తిమీద సాములా మారనున్నది.
భాషా పండితులు తెలుగు, హిందీ, పీఈటీలు పదోన్నతులు, బదిలీల కోసం ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, అభ్యంతరాల స్వీకరణతోపాటు వెబ్సైట్లో సీనియారిటీ జాబితాను ఉంచనున్నారు. అయితే జిల్లాలో అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కొన్ని పొరపాట్లు దొర్లడంతోపాటు సరైన పత్రాలను సకాలంలో సమర్పించకపోవడం వల్ల మళ్లీ అప్పీల్ చేసుకునే వెసులుబాటును విద్యాశాఖ కల్పించింది. దీంతో పదోన్నతులకు అర్హత కలిగిన ఉపాధ్యాయులు వారం రోజుల నుంచి విద్యాశాఖ కార్యాలయం వద్ద క్యూ కడుతున్నారు. ఎక్కడ ఖాళీలు ఉన్నాయి? బదిలీ అయితే ఏ పాఠశాలకు వెళ్లాలి? అనే దానిపై తర్జన భర్జన పడుతున్నారు. అభ్యంతరాల అనంతరం జాబితాను వెలువరించి ఆప్షన్ల ద్వారా విద్యాశాఖ అధికారులు ఉద్యోగోన్నతులు కల్పించనున్నారు. ఈ నెల 16 కల్లా పదోన్నతులు కల్పించి.. 22వ తేదీ నాటికి బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని విద్యాశాఖ తేదీలను కూడా ఖరారు చేసింది. దీనిపై కసరత్తు కూడా తుది దశకు చేరింది.
బదిలీలు, పదోన్నతులు వారి అర్హతను బట్టి కల్పించినా.. కొత్త ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా ఈ ప్రక్రియను చేపట్టడంపై సర్వతా ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి. ఇప్పటికే ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయడంలో చాలా కాలంగా నిర్లక్ష్యం చేస్తూనే వస్తున్నారు. దీంతో సర్కారు పాఠశాలల విద్యపై నీలినీడలు అలుముకుంటున్నాయి. అయినా ఎన్నో సవాళ్లను భరిస్తూనే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. పాఠశాలల పునఃప్రారంభం నాటికి యూనిఫాంలు ఇవ్వలేకపోవడం, అప్పుడప్పుడు పిల్లలకు మధ్యాహ్న భోజనంలో వడ్డించే కూరలు అంతంతమాత్రంగానే పెట్టడం వల్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. అంతేకాక మధ్యాహ్న భోజనం తయారు చేసే కార్మికులకు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో వారు కూడా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇలాంటి సమస్యలు నిత్యం విద్యాశాఖను వెంటాడుతూనే ఉన్నాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో చాలా కాలం తర్వాత బదిలీలు, పదోన్నతులు చేపడుతున్నారు. ఇది సంతోషకరమైన విషయమే. కానీ.. ప్రస్తుతం పదోన్నతులపై వేరే పాఠశాలలకు వెళ్లనున్న టీచర్ల స్థానంలో ప్రభుత్వం విద్యావలంటీర్లను నియమించాలి. అలాంటి సమస్య రాకుండా విద్యాశాఖ ముందస్తు చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే పలు పాఠశాలల్లో టీచర్ల సమస్య ఉంది.
ఈ నెల 22వ తేదీ నాటికి బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తవుతుంది. ఉద్యోగోన్నతిపై వెళ్లిన ఉపాధ్యాయుల స్థానంలో ప్రభుత్వం డీఎస్సీ ద్వారా కొత్త టీచర్లను నియమిస్తుంది. అప్పటి వరకు ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై సర్దుబాటు చేస్తాం. విద్యావలంటీర్లను నియమించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది.