Mojtaba Khamenei : ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా మొజ్తాబా ఖమేనిని ఆ దేశ అసెంబ్లీ ఎన్నుకున్న సంగతి తెలిసిందే. అయితే, సుప్రీం లీడర్‌గా ఎన్నికైన తర్వాత కూడా మొజ్తాబా ఖమేని ఎక్కడా కనిపించడం లేదు. ప్రజల ముందుకు రాలేదు. బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆయన ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు చెందిన ఒక అధికారిక టీవీ ఛానెల్ చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఇరాన్ మీడియా మొజ్తాబా ఖమేనిని ‘జాన్బాజ్ ఆఫ్ రమదాన్’ అని అభివర్ణించింది.
అంటే యుద్ధంలో గాయపడిన వాడు అని అర్ధం. రంజాన్ సమయంలో జరుగుతున్న యుద్ధం కావడంతో కూడా ఇలా వర్ణించింది. యుద్ధంలో శతృవుల ద్వారా ఖమేని గాయపడినట్లు చేసిన ప్రకటనతో.. ఆయన తాజా యుద్ధంలో గాయపడ్డారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే యుద్ధం ప్రారంభమైన తర్వాత కానీ, తన తండ్రి, భార్య, కుటుంబం మరణించిన తర్వాత కానీ ఆయన ఎప్పుడూ బయట కనిపించలేదు. ఆయనకు సంబంధించిన ఒక ఫొటో, వీడియో కూడా బయటకు రాలేదు. ఆయన్నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. దీంతో ఆయన గాయపడ్డారేమో అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే, ఇరాన్ ఛానెల్ చెప్పినట్లు యుద్ధంలో గాయపడటం అంటే ఆయన శరీరానికి అయిన గాయంగానే పరిగణించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన కుటుంబాన్ని కోల్పోవడం కూడా గాయం కిందే లెక్క.
దీంతో మొజ్తాబా నిజంగానే గాయపడ్డారా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు. ఆయన ఎక్కడున్నారు అనే విషయంలో కూడా స్పష్టత లేదు. ఇక.. మొజ్తాబా ఎన్నికపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహంతోనే ఉన్నాడు. అతడి ఎంపికపై అసంతృప్తితో ఉన్న ట్రంప్.. మొజ్తాబా మనశాంతిగా ఉంటాడని తాను భావించడం లేదన్నారు. మొజ్తాబా ఎంపికను తాను అంగీకరించబోనని, అతడి బదులు ఇరాన్లో శాంతిని, సామరస్యాన్ని నింపే నాయకుడిని ఎన్నుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.