బీఆర్ఎస్ హయాంలో ‘పల్లె ప్రకృతి వనాలు’ ఎంతో ఆహ్లాదాన్ని పంచాయి. రకరకాల పూలు, పండ్లు, నీడనిచ్చే చెట్లతో పచ్చగా కళకళలాడుతూ కనిపించాయి. పల్లె ప్రజలు కూడా పట్టణ ప్రజల మాదిరి పార్కుల్లో ఉదయం, సాయంత్రం సంతోషంగా గడిపారు. నిర్వహణకు కేసీఆర్ సర్కార్ నిధులు సకాలంలో ఇవ్వడంతో పంచాయతీ సిబ్బంది సైతం వాటిని కంటికిరెప్పలా కాపాడారు. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.. పల్లె ప్రకృతి వనాలు ఎండిపోయి కళాహీనంగా ఆనవాళ్లు లేకుండా కనిపిస్తున్నాయి. అధికారులు వనాల నిర్వహణను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. బోనకల్లు మండలం రావినూతల గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని ఏకంగా నామరూపాలు లేకుండా చేశారు. స్థానిక కాంగ్రెస్ నాయకులే ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్పై అక్కసుతో పాఠశాలలో ఉన్న వనాన్ని పూర్తిగా తొలగించారు. రూ.లక్షల ప్రజాధనం వృథా అవుతున్నా అధికారులు స్పందించకపోవడంపై కాంగ్రెస్ పాలనపై పల్లె ప్రజలు మండిపడుతున్నారు.
– బోనకల్లు/ పెనుబల్లి/ రఘునాథపాలెం, మార్చి 18
గ్రామాల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలను(పార్కులు) ఏర్పాటు చేసింది. కానీ.. నేటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఆ వనాలు ఎండిపోయి కనిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రావినూతల గ్రామంలో పల్లె ప్రకృతి వనం ఏకంగా కనుమరుగైంది. ఆనాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఖాళీ ప్రదేశంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు నాటి సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్ గ్రామ పంచాయతీలో తీర్మానం చేశారు. ఈ మేరకు అధికారులు పాఠశాల ఆవరణలో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు.
మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మొకలు నాటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జాతీయ ఉపాధిహామీ పథకంలో భాగంగా 5లక్షల 9వేల 327 రూపాయలు ఖర్చుపెట్టి ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని సైతం నెలకొల్పారు. ఈ వనంలో రకరకాల పూల మొకలు, ఆకర్షణీయమైన చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది. పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ ప్రకృతి వనాన్ని కంటికిరెప్పలా కాపాడుకున్నారు. కానీ.. ఏమైందో ఏమో ప్రస్తుతం ప్రకృతివనంలో ఉన్న మొకలు, చెట్లను పూర్తిగా తొలగించారు. పచ్చని మొకలతో కళకళలాడిన ప్రకృతివనం నేడు పూర్తిగా కనుమరుగైపోయింది.
అధ్వానంగా పెనుబల్లి వనం..
పెనుబల్లి మండల కేంద్రంలోని మసీదు పక్కన ఉన్న పల్లె ప్రకృతి వనంలో నాడు ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. సుదూర ప్రాంతం నుంచి ఎన్నో రకాల పండ్ల మొక్కలు, పూల మొక్కలు, నీడనిచ్చే మొక్కలు తీసుకొచ్చి పంచాయతీ సిబ్బంది ఎంతో బాధ్యతగా పెంచారు. జామ, సపోట, లవంగం, చెక్క, బాదం చెట్లతోపాటు పలు రకాల పూల మొక్కలకు ఉదయం, సాయంత్రం నీళ్లు పోస్తూ ఎప్పటికప్పుడు వనాన్ని శుభ్రం చేసేవారు. పరిసర ప్రాంతాల చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ప్రకృతి వనంలో ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉండేవారు. కానీ.. ప్రభుత్వం మారిన తర్వాత ఎవ్వరు కూడా అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో మొక్కలన్నింటినీ జంతువులు ధ్వంసం చేశాయి. ఆలనాపాలనా లేక పల్లె ప్రకృతి వనం ప్రస్తుతం అధ్వానంగా తయారైంది.
ఆనవాళ్లు లేని రఘునాథపాలెం వనం
మండల కేంద్రం రఘునాథపాలెం మోడల్ కాలనీలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం నిర్వహణను అధికారులు గాలికొదిలేశారు. లక్షలు ఖర్చు చేసి వేసిన మొక్కలు ప్రస్తుతం ఎండిపోయాయి. వనం పనికిరాకుండా పోయింది. కేవలం బోర్డులు, కట్టిన గోడలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. ఒకప్పుడు అందమైన పూలమొక్కలతో స్థానికులకు ఆహ్లాదాన్ని పంచిన ఈ వనంలోని చెట్లను ఇష్టానుసారంగా నరికివేశారు. నర్సరీలోని బల్లాలు, రోడ్లు కనిపించడం లేదు. ప్రధాన గేటు ధ్వంసమైంది. బయటి శిలాఫలకం కానరాకుండా చేశారు. పక్కనే పిల్లలు ఆడుకునేందుకు ఏర్పాటు చేసిన ఆట వస్తువులు, జిమ్ పరికరాలు విరిగిపోయి కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకులే కావాలని పల్లె ప్రకృతి వనం ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారని గ్రామస్తులు కొందరు ఆరోపిస్తున్నారు. వనంలోని చెట్లన్నింటినీ జేసీబీ సహాయంతో తొలగించారని, శిలాఫలకాన్ని మాయం చేశారని చెబుతున్నారు. కలెక్టర్ దృష్టి సారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
పూర్తిస్థాయిలో విచారణ చేస్తాం..
రావినూతల పాఠశాలలో పల్లె ప్రకృతి వనం ఉన్నట్లు నాకు తెలియదు. పల్లె ప్రకృతి వనాన్ని తీసివేయాలన్నా.. ఉంచాలన్నా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్ణయం జరగాలి. పల్లె ప్రకృతి వనాన్ని తొలగించడంపై పూర్తిస్థాయిలో విచారించి నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తాం.
– రమాదేవి, ఎంపీడీవో, బోనకల్లు
కాంగ్రెస్ నాయకులే తొలగించారు..
రావినూతల పాఠశాలలో ఉన్న పల్లె ప్రకృతి వనాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులే దగ్గరుండి మరీ తొలగించేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ జ్ఞాపకాలను చెరిపేసేందుకు అక్కసుతో వారు ఈ పనిచేశారు. రూ.లక్షలు ఖర్చుపెట్టి ఏర్పాటు చేసిన ప్రకృతి వనాన్ని తొలగించిన వారిపై అధికారులకు ఫిర్యాదు చేశాను. కానీ.. ఇంతవరకు వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
– కొమ్మినేని ఉపేంద్ర, మాజీ సర్పంచ్, రావినూతల, బోనకల్లు
ప్రకృతి వనాలను కాపాడాలి..
ప్రజలకు ఆహ్లాకరమైన వాతావరణాన్ని అందించేందుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలను నిర్మించింది. నిర్వహణ బాధ్యతను సర్పంచ్‌లకు అప్పగించింది. సుదూర ప్రాంతాల నుంచి మొక్కలు తెచ్చి ప్రకృతి వనం సృష్టించాం. కానీ.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ మొక్కలకు నీళ్లు పోయలేక ఎండబెడుతున్నారు. ఉన్నతాధికారులు పట్టించుకొని పల్లె ప్రకృతి వనాలను కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.
– తేజావత్ తావునాయక్, మాజీ సర్పంచ్, పెనుబల్లి