అశ్వారావుపేట, డిసెంబర్ 20: తిరుమలకుంటకు ఆర్ఎంపీ చక్రధర్ ఈనెల 8న దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించిన పోలీసులు కొద్దిరోజుల్లోనే కేసును ఛేదించారు. మృతుడి స్నేహితుడే నిందితుడని తేల్చారు. అతడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. అశ్వారావుపేటలోని పోలీస్‌స్టేషన్‌లో సీఐ బాలకృష్ణ మంగళవారం వివరాలు వెల్లడించారు. హత్య కేసులో వినాయకపురానికి చెందిన ఆర్ఎంపీ స్నేహితుడు ఎస్కే నజీర్ అలియాస్ డాంబ్లీ అనుమానితుడిగా పోలీసులు భావించి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో తానే ఆర్ఎంపీని హత్య చేసినట్లు నజీర్ అంగీకరించాడు. నిందితుడు కొన్నేళ్ల నుంచి వ్యసనాలకు బానిసయ్యాడు. తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో భార్య అతడితో గొడవపడి పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించి వేరే ప్రాంతానికి వెళ్లి కొత్త జీవితం ప్రారంభించాలని భావించాడు. అందుకు తన స్నేహితుడు, ఆర్ఎంపీ చక్రధర్ ధరించిన బంగారు ఆభరణాలను అపహరించాలని పథకం పన్నాడు. ఈక్రమంలో ఈ 8న వినాయకపురం శివారులో కోడి పందేలు ఆడదామని ఆర్ఎంపీని నమ్మించాడు. ఆర్ఎంపీ ద్విచక్రవాహనంపై ఇద్దరూ స్థావరానికి వెళ్లారు. నజీర్ వెంట తెచ్చుకున్న బ్యాగ్ నుంచి కత్తి తీసి ఆర్ఎంపీ పీక కోసి కోశాడు.
ఆర్ఎంపీ పారిపోయేందుకు యత్నించగా నజీర్ వెంబడించాడు. ఆర్ఎంపీని కిందపడేసి అతనిపై నజీర్ కూర్చుని మెడపై కత్తితో పొడిచాడు. ఆర్ఎంపీ మృతిచెందినట్లు నిర్ధారించుకున్న తర్వాత నజీర్ బంగారు ఆభరణాల కోసం వెతికాడు. కానీ ఆర్ఎంపీ ఒంటిపై ఒక్క ఆభరణమైనా లభించలేదు. బైక్, ఆర్ఎంపీ మొబైల్ తీసుకుని నజీర్ అక్కడి నుంచి ఉడాయించాడు. తర్వాత ఆర్ఎంపీ మొబైల్‌కు కాల్ వచ్చింది. నజీర్ ఫోన్ ఎత్తి అపరిచిత వ్యక్తిగా మాట్లాడాడు. ఆర్ఎంపీ మెడిసిన్ కోసం భద్రాచలం వెళ్లాడని, తన ఇంట్లో మొబైల్ చార్జింగ్ పెట్టి వెళ్లాడని నమ్మబలికాడు. మొబైల్లో ఆర్ఎంపీ సిమ్ తీసి తన సిమ్ వేశాడు.
స్నేహితులను తప్పుదోవ పట్టించడానికి వారికి కాల్ చేసి ఆర్ఎంపీ హత్యపై ఆరా తీసినట్లు నటించాడు. మంగళవారం నజీర్ ములుగు జిల్లా వాజేడు వెంకటాపురంలోని స్నేహితుల ఇంటికి వెళుతున్నాడు. నారంవారిగూడెం వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపడుతుండగా నజీర్ ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా కనిపించాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని హత్యకేసును ఛేదించారు. నిందితుడు హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు ఆర్ఎంపీ బైక్, మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్సైలు బి.రాజేశ్‌కుమార్, సాయికిశోర్‌రెడ్డి పాల్గొన్నారు.