భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ కొత్తగూడెం గణేష్ టెంపుల్, ఫిబ్రవరి 2: మున్సిపల్ ఎన్నికల వేళ చేరికలు బీఆర్ఎస్ పార్టీలో మరింత ఉత్సాహాన్ని తెచ్చిపెట్టాయి. గత వారంరోజులుగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్ సర్కార్ హామీల పేరుతో ప్రజలకు పడిన బాకీలను తెలియజేస్తూ బాకీకార్డు ద్వారా ప్రచారాన్ని ముమ్మరం చేసిన బీఆర్ఎస్కు విజయావకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. జిల్లాలో మున్సిపల్, కార్పొరేషన్ వార్డుల్లో గులాబీ శ్రేణులు ప్రచారంలో దూసుకుపోతున్నారు.
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో ఇప్పటికే పాల్వంచ, కొత్తగూడెం పట్టణాల్లో ముఖ్య నాయకులు గులాబీ పార్టీలో చేరారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, కాపు సీతాలక్ష్మిలు గులాబీ కండువాలు కప్పి ఆహ్వానిస్తున్నారు. బీజేపీ నుంచి కూడా వందల మంది కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. మాజీ కౌన్సిలర్లు భీమా శ్రీధర్ దంపతులు సైతం ఇటీవల హైదరాబాద్ వెళ్లి బీఆర్ఎస్లో చేరారు. తాజాగా సోమవారం కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 53వ డివిజన్ మేదరబస్తీకి చెందిన ముద్దంగుల భాస్కర్, ముద్దంగుల మహేశ్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర వారికి బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
జీఆర్ బస్తీకి చెందిన ఒక కుల సంఘం మొత్తం వనమా రాఘవ నాయకత్వంలో బీఆర్ఎస్లో చేరారు. ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో గత రెండు వారాలుగా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియానాయక్ ఆధ్వర్యంలో భారీగానే చేరిపోయారు. రాయల స్వరూప, బెల్లం సాల్మన్, ఎస్.పాషా, పింగిలి నరేశ్, సిరిమల్లి రాజు, అజ్మీరా రవి, కుంజా సతీశ్, వినోద, ఎస్కే.పాషా తదితర నాయకులు పార్టీలో చేరారు. అశ్వారావుపేట మున్సిపాలిటీలో మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు సైతం ఆయా మున్సిపాలిటీల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి మున్సిపాలిటీల్లో సత్తా చాటుకునేందుకు పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నారు.
చక్రం తిప్పుతున్న ఎంపీ వద్దిరాజు
కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికలు ఈసారి అన్ని ప్రధాన పార్టీలకు సవాల్‌గా మారాయి. తొలిసారిగా కొత్తగూడెం కార్పొరేషన్ కావడంతో పాల్వంచ, సుజాతనగర్ ఏరియాలు కలవడంతో కొత్తగూడెం నగరపాలక సంస్థగా ఏర్పాటైంది. దీంతో రాజకీయ నాయకులు ‘గూడెం పీఠం’పైనే దృష్టి సారించారు. ఎంపీ, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర కొత్తగూడెం ఇన్చార్జిగా ఉండడంతో గూడెం పీఠం కైవసం చేసుకోవడం కోసం కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా రెండు వారాల నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి చేరికలు ప్రారంభమయ్యాయి. ప్రతి డివిజన్లో కాంగ్రెస్‌కు భారీ స్థాయిలోనే గండికొట్టే ప్లాన్ వేయడంతో రోజుకొకరు కాంగ్రెస్‌ను వీడి గులాబీ పార్టీలోకి చేరుతున్నారు. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చి పార్టీపై ప్రత్యేక దృష్టి సారించారు.
మున్నేరు రిటైనింగ్ వాల్ ఘనత బీఆర్ఎస్దే..
ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 2: వానకాలం వరదలతో మున్నేటి పరీవాహక ప్రాంత ప్రజలు ఏటా ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో ఆనాటి సీఎం కేసీఆర్‌ను ఒప్పించి రిటైనింగ్ వాల్, తీగల వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినట్లు పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి తెలిపారు. రెండు ప్రాజెక్టుల నిర్మాణానికి దాదాపు రూ.800 కోట్ల నిధులు మంజూరు చేయించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని అన్నారు. వరద సమయంలో ముంపు ప్రాంత ప్రజలకు పార్టీ నాయకులు, స్వయంగా తాను కలిసి తమ వంతు సాయం అందించిన విషయాన్ని గుర్తు చేశారు. ఏదులాపురం మున్సిపాలిటీ జలగంనగర్ 4వ డివిజన్లో బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశం సోమవారం జరిగింది.
ఈ సందర్భంగా ఆయా పార్టీలకు చెందిన పలు కుటుంబాల వారు బీఆర్ఎస్ వార్డు బాధ్యుడు చీరాల వీరభద్రం ఆధ్వర్యంలో కందాల ఉపేందర్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అనంతరం బీఆర్ఎస్ ఖమ్మం రూరల్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కందాల మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధే తప్ప కొత్తగా ఈ రెండేళ్లలో జరిగింది ఏమీ లేదని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో వార్డుల కౌన్సిలర్లుగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే అభ్యర్థులను నిలబెట్టామన్నారు. 11న జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ సీపీఎం కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బెల్లం ఉమ, 4వ వార్డు అభ్యర్థి చీరాల రమణతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.