చింతకాని, జూలై 12 : ప్రభుత్వ పాఠశాలల్లో మెనూ తప్పక అమలు చేయాలని, విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యమైన విద్యను అందించాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు అన్నారు. పందిళ్ళపల్లి ఉన్నత పాఠశాలలో తరగతి గదులు, బోధనాభ్యసన ప్రక్రియ, మౌలిక వసతులు, పాఠశాల పరిసరాలు, మధ్యాహ్న భోజనాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలల బాగు కొరకు గత కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.8 వేల కోట్లు ఖర్చు చేసిందని గుర్తు చేశారు. సమైక్య రాష్ట్రంలో మరుగునపడిన వ్యవస్థలన్నింటినీ గత సీఎం కేసీఆర్ ఒక్కొక్కటిగా బాగు చేశారన్నారు. పదో తరగతిలో మెరుగైన ఫలితాల సాధనకు ఉపాధ్యాయులు ఇప్పటి నుంచే సమష్టిగా కృషి చేయాలని, వంద శాతం ఫలితాలు సాధించాలన్నారు. సన్నబియ్యంతో భోజనం, వారానికి మూడు గుడ్లు, ఉచిత పాఠ్య, నోట్‌పుస్తకాలు, దుస్తులను ప్రభుత్వం అందిస్తోందని, విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకొని బాగా చదివి గ్రామానికి, పాఠశాలకు పేరు తేవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మాడూరి రామయ్య, ఎంపీవో మల్లెల రవీంద్రప్రసాద్, కార్యదర్శి నిఖిల్, హెచ్ఎంలు రామ్మోహన్, జలీల్‌పాషా, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.