సత్తుపల్లి, నవంబర్ 24: భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావును కిరాతకంగా హత్యచేయడం ఆటవిక చర్య అని, ఈ హత్యను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బెండాలపాడు, మద్దుకూరు గ్రామాల్లో పోడు భూముల విషయంలో అటవీశాఖ అధికారులకు, గిరిజనులకు మధ్య గొడవలు జరిగాయని, అయితే రేంజర్పై దాడిచేసి అతడిని హత్యచేయడం హేయమైన చర్య అని అన్నారు.
పోడు భూములను వ్యవసాయ భూములుగా మార్చాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పోడు చట్టాలను సవరిస్తూ అర్హులకు పట్టాలు అందించే కార్యాచరణకు శ్రీకారం చుట్టిందని గుర్తుచేశారు. అయినప్పటికీ అటవీ భూములను ఆక్రమించాలనే ఉద్దేశంతో కొందరు వ్యక్తులు ఇలాంటి ఆటవిక చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నానని, రేంజర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నానని పేర్కొన్నారు.