మధిర టౌన్, ఫిబ్రవరి 25: ‘మన బస్తీ- మన బడి’ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్ నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఖమ్మం జిల్లా మధిర పట్టణ పరిధిలోని జిల్లాపరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం మాతంగి శ్రీలత శనివారం పట్టుబడింది. ఖమ్మం ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. తొలివిడత ‘మన బస్తీ- మన బడి’కి మధిర జడ్పీ పాఠశాల ఎంపికైంది. పాఠశాలలో చేపడుతున్న అభివృద్ధి పనులకు సర్కార్ రూ.23.82 లక్షలు నిధులు కేటాయించింది. పాఠశాల విద్యాకమిటీ చైర్మన్, సభ్యుల ఆమోదం మేరకు కాంట్రాక్టర్ మునుగోటి వెంకటేశ్వర్లు పనులు ప్రారంభించాడు. ప్రస్తుతం పనులు చివరి దశకు చేరుకున్నాయి. చేసిన పనులకు రెండు నెలల క్రితం ప్రభుత్వం రూ.7.88 లక్షల చెక్కు విడుదల చేసింది. ఆ చెక్కు పాఠశాల విద్యాకమిటీ చైర్మన్, ఇన్చార్జి హెచ్ఎం (జాయింట్) పేరుపై ఉంది. చేసిన పనులకు సంబంధించిన చెక్కు ఇవ్వాలని కాంట్రాక్టర్ 20 రోజుల నుంచి బతిమిలాడుతున్నాడు.
అయినా హెచ్ఎం కనికరించలేదు. ప్రభుత్వం విడుదల చేసిన రూ.23.82 లక్షల నిధుల్లో రూ.50 వేలు లంచం ఇస్తే తప్ప చెక్కులు ఇవ్వనని హెచ్ఎం బెదిరించింది. గత్యంతరం లేని పరిస్థితిలో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు హెచ్ఎంకు రూ.50 వేలు ఇచ్చేందుకు కాంట్రాక్టర్ ఒప్పుకున్నాడు. దీనిలో భాగంగా తొలిదఫాలో రూ.25 వేలు ఇస్తానన్నాడు. కాంట్రాక్టర్ కుమారుడు మనుగోటి రాము శనివారం పాఠశాలలో హెచ్ఎంకు రూ.25 వేలు అందిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆమె నివాసంలోనూ సోదాలు నిర్వహిస్తున్నామని, నిందితురాలిని ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు.