సింగరేణి జన్మస్థలంగా పిలిచే బొగ్గుట (ఇల్లెందు) చరిత్ర ఎంతో ఘనం.. కానీ, భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి బొగ్గుగని ప్రారంభించింది ఇల్లెందులోనే. గతంలో ఇక్కడ నాలుగు మైన్లు, రెండు ఓపెన్‌కాస్ట్‌లతో 12 వేల మంది సింగరేణి కార్మికులు, రెండువేల సింగరేణి క్వార్టర్స్, జీఎం కార్యాలయం, సింగరేణి హాస్పటల్, సెక్యూరిటీ ఆఫీస్, రెండు క్రీడా మైదానాలు, గెస్ట్‌హౌస్‌లు, సీహెచ్‌పీ, వీటీసీ, నిత్యం పలు పట్టణాల నుంచి వచ్చే కార్మికులతో ఇల్లెందు పట్టణం కళకళలాడుతూ ఉండేది.
ఒకప్పుడు సింగరేణి ఉద్యోగులు, కార్మికులతో ఆదాయంలో తెలంగాణకే తలమానికగా నిలిచిన బొగ్గుట ప్రస్తుతం కొత్త మైన్లు, ఓసీలు లేక వెలవెలపోతున్నది. ఇప్పుడు ఇల్లెందు ఏరియాలో 580 మంది సింగరేణి ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. వీరిలోనూ పలువురు డిప్యూటేషన్‌పై ఇతర సింగరేణి ఏరియాలకు వెళ్లారు. సింగరేణికి పుట్టినిల్లు అయిన ఇల్లెందు గురించి సింగరేణి యాజమాన్యం, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి కొత్త ప్రాజెక్టులను త్వరగా ప్రారంభించాలని, ఎంతో చరిత్ర కలిగిన ప్రాంతం కీర్తి మసకబారక ముందే తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు బ్రిటిష్ పాలన, తెలంగాణ ప్రాంతంలో నిజాం పాలన సాగుతున్నది. ఆ సమయంలో వరంగల్ నుంచి భద్రాచలానికి ఎడ్ల బండి మీద వెళ్లే ప్రయాణికులు ఇల్లెందు సమీపాన వాగు పక్కన ఎడ్ల బండి ఆపి వంట వండేందుకు నల్లటి రాళ్లతో పొయ్యి పెట్టారు. ఆ సమయంలో పొయ్యిలో కట్టెలతోపాటు పొయ్యి రాళ్లు కూడా మండటంతో వారు భయపడ్డారు. ఈ విషయం నిజాం ప్రభుత్వం ద్వారా బ్రిటిష్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారి విలియం కింగ్‌కు తెలిపారు. దీంతో 1871లో దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి బొగ్గుగనిని ఇల్లెందులోనే కనుగొన్నారు.
ఆయన గౌరవార్థం గనులలో బొగ్గు పొరలకు రెండు పేర్లు పెట్టారు.. వాటిలో ఒక బొగ్గు పొరకు కింగ్సిమ్ అని పేరు పెట్టారు. నేటికీ ఇల్లెందు జీఎం కార్యాలయంలో ఆయన విగ్రహం పెట్టి ప్రతి సంవత్సరం వేడుకలు నిర్వహిస్తారు. 1886లో హైదరాబాద్(డెక్కన్) కంపెనీ లిమిటెడ్ ఇక్కడ మైనింగ్ హక్కులను పొందింది. ఆ తర్వాత 1920 డిసెంబర్ 23న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌గా అధికారికంగా ఏర్పాటైంది. సుమారు 155 సంవత్సరాల నుంచి బొగ్గు తీస్తున్న ప్రాంతం ఇల్లెందు. ఇంతటి ఘనచరిత్ర కలిగిన ఇల్లెందు భావితరాలకు మసకబారిన ప్రాంతంగా కనిపించనుంది.

ఇల్లెందు మనుగడకు కృషి అవసరం..
దేశంలోనే బొగ్గు ఉత్పత్తిలో ఎంతో ఘనత సాధించిన ఇల్లెందు ఏరియా మనుగడకు నూతనంగా జేకే-5 ఓసీకి అనుబంధంగా పూసపల్లి ఓసీని వెంటనే ప్రారంభించాలని, ప్రస్తుతం ఇక్కడ ఉన్న సింగరేణి ఉద్యోగులు, కార్మికులను వేరే ప్రాంతాలకు డిప్యూటేషన్, బదిలీలను ఆపాలని కార్మిక సంఘాలు, స్థానిక ప్రజలు కోరుతున్నారు. అలాగే సింగరేణి చరిత్ర ఆనవాళ్లతో దేశంలోనే మొదటగా బొగ్గు కనుగొన్న ప్రాంతంగా భావితరాలకు ఇల్లెందు చరిత్ర తెలిసేలాగా ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలని, దానిలో సింగరేణికి సంబంధించిన వస్తువులను, అలనాటి జ్ఞాపకాలను సింగరేణి అభివృద్ధి చెందిన విధానాన్ని చూపించేలా భద్రపరచాలని వేడుకుంటున్నారు. ఈ ప్రాంతానికి అనుసంధానంగా కోయగూడెం ఓసీ-3ని త్వరగా సింగరేణికి కేటాయించి ప్రారంభించాలని కోరుతున్నారు.
తిరోగమన దిశలో సింగరేణి
సింగరేణి దశ మారుతుందని కార్మికులు నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు.. కానీ, ప్రస్తుత పరిస్థితి చూస్తే సింగరేణి తిరోగమన దిశలో పయనిస్తున్నది. ఒకవైపు కొత్త ప్రాజెక్టులు రావడం లేదు. కారుణ్య నియామకాల విషయంలో మెడికల్ బోర్డు ఆగిపోయింది. మళ్లీ గోల్డెన్ షేక్ హ్యాండ్ ద్వారా కార్మికులను ఇంటికి పంపే కార్యక్రమం అమలుకు సింగరేణి సిద్ధమవుతున్నట్లు వార్తలు కార్మికుల్లో గుబులు రేపుతున్నాయి. పైగా కారుణ్య నియామకాలపై విజిలెన్స్ విచారణ చేపడతామన్న ప్రభుత్వ విధానంపై కార్మికులు మండిపడుతున్నారు.
-రంగనాథ్, టీబీజీకేఎస్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ
యాజమాన్యం, ప్రభుత్వం దృష్టిపెట్టాలి..
ఇల్లెందు ఏరియాలో బొగ్గు లేకపోవడం వల్ల కాదు.. అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఆలస్యం జరిగింది. ఇప్పటికైనా ఇల్లెందు ఎమ్మెల్యే జోక్యం చేసుకొని ఎంపీ, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రితో మాట్లాడి పర్యావరణం, ఇతర అనుమతులు పెండింగ్‌లో ఉంటే వాటిని వెంటనే పరిష్కరించాలి. కోయగూడెం పిట్-3, జేకే పూసపల్లి ఓసీలను సింగరేణికి అప్పజెప్పాలి.
-షేక్ యాకుబ్ షావలి, టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు